తెలుగు ఎంపీల పరువు తీసేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంటున్నారు నటుడు, ఆ మధ్య ఈ తరహా వివాదంలో చిక్కుకుని టీటీడీ చానల్ పదవిని కోల్పోయిన పృథ్విరాజ్. ఒక మహిళతో సరససంభాషణలు జరిపిన వివాదంలో ఫోన్ కాల్ రికార్డుతో పృథ్విరాజ్ వార్తల్లో నిలిచాడు.
ఎంతో భక్తిప్రవత్తులతో, శ్రద్ధతో నిర్వహించాల్సిన టీటీడీ చానల్ డైరెక్టర్ పోస్టులో ఉంటూ.. ఆ తరహా వివాదంలో నిలవడం పృథ్వి పరువు తీసింది. ఆయనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ హోదాలో నామినేట్ చేసింది. వివాదం రేగిన తర్వాత ఆయనను ఆ హోదా నుంచి తప్పించేశారు.
కొన్నాళ్ల పాటు ఆ వ్యవహారంపై కామ్ గా ఉండిన పృథ్విరాజ్, చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పృథ్వి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని నాళ్లూ తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆయన ఆడియో లీకులను పట్టుకుని ట్రోల్ చేశాయి. ఈ మధ్యనే పృథ్వి జనసేన తీర్థం పుచ్చుకున్నట్టుగా ఉన్నాడు. అయితే పృథ్వికి అతి తేలికగా, తక్కువ కాలంలో అవకాశం వస్తే.. ఆయనే దాన్ని కోల్పోయాడనేది ప్రముఖంగా వినిపించే విశ్లేషణ.
ఆ వ్యవహారం అలా ఉంటే.. గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ పై పృథ్వి కూడా స్పందించేశారు. మాధవ్ ది సిగ్గుమాలిన పని అన్నట్టుగా ఈయన తేల్చారు. ఎస్పీ ప్రకటనను కూడా పృథ్వి తప్పు పట్టాడు. ఇదే ఊపులో తనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టారంటూ కాస్త ఆక్రోశాన్ని కూడా వెల్లగక్కాడు.
మొత్తానికి పృథ్వి కూడా తన వంతు నీతులు చెప్పేశారు. టీటీడీ చానల్ డైరెక్టర్ అనే పవిత్రమైన హోదాలో ఉంటూ.. వివాదంలో చిక్కి… తనను ఇరికించారంటూ చెప్పుకొచ్చిన పృథ్వి, ఇప్పుడు బాధ్యత, పరువు, హోదా అంటూ మాట్లాడటం కాలమహిమ కాబోలు!