తీర్పులిచ్చే విషయంలో న్యాయమూర్తులు బాహ్య ఒత్తిళ్లకు అతీతంగా ఆలోచించి స్వతంత్రంగా నిలబడాలని భారత అత్యున్నత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సున్నిత హెచ్చరిక చేశారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంచే క్రమంలో ఆయన కాస్త కఠినంగా కీలక అంశాలను చెప్పారు. జస్టిస్ పి.డి. దేశాయ్ 17వ స్మారకోపన్యాస కార్యక్రమంలో భాగంగా ఆయన ‘చట్టబద్ధ పాలన’ అనే అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ప్రసంగించారు.
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని హెచ్చరించారు. బిగ్గరగా చేసే నినాదాలు, వాస్తవాలు అత్యధిక ప్రజల అభిప్రాయాలకు ప్రతిబింబం కాకపోవచ్చన్న విషయాన్ని న్యాయమూర్తులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ‘మంచి-చెడు, తప్పు-ఒప్పు, అసలు-నకిలీల మధ్య వ్యత్యాసాలను తెలుసుకోలేని విధంగా విషయాన్ని విపరీతంగా ప్రేరేపించే శక్తి ఆధునిక మీడియా సాధనాలకు ఉందన్నారు.
ఈ నేపథ్యంలో మీడియా విచారణల ప్రాతిపదికగా తీర్పులు వెలువరించొద్దని హెచ్చరించారు. స్వతంత్రంగా పనిచేయడం అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల ద్వారా, చట్టాల రూపంలో న్యాయ వ్యవస్థను ప్రత్యక్షంగా లేదా పరోక్షం గానో నియంత్రించరాదని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.
ఇందుకు విరుద్ధంగా జరిగితే చట్టబద్ధ పాలన ఓ భ్రమగా మిగిలిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమైన వ్యవస్థలకు నాయకత్వం వహిస్తున్న వారు రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నామా? లేదా? అని పరీక్షించుకోవాలని సూచించారు.
పరిపాలకుడిని మార్చినంత మాత్రాన దౌర్జన్యాల నుంచి రక్షణ లభిస్తుందన్న హామీ ఏమీలేదన్నారు. తీర్పుల ద్వారా మాత్రమే న్యాయమూర్తుల గురించి తెలుస్తుందన్నారు. న్యాయమూర్తుల సత్తాను పరీక్షించడానికి తీర్పులే నిజమైన కొలమానాలని కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు వెలువరించే గొప్ప తీర్పులు ఎప్పటికీ న్యాయబద్ధంగా గుర్తుంటాయని జస్టిస్ రమణ పేర్కొన్నారు.