హీరోయిన్లు ఎలా తమ గ్లామర్ మెయింటైన్ చేస్తారు? వాళ్లు రోజూ ఏం తింటారు? ఈ ఆసక్తి అందర్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా కాజల్ లాంటి స్టార్ హీరోయిన్లు 15 ఏళ్లుగా అదే ఫిజిక్, అదే గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారనే ఉత్సుకత చాలామందిలో ఉంటుంది. ఇదే ప్రశ్న కాజల్ కు ఎదురైంది. అయితే తన డైలీ డైట్ చాలా సింపుల్ అంటోంది ఈ ముద్దుగుమ్మ.
రోజూ పొద్దున్నేఓ గుడ్డు తింటుంది కాజల్. ఆ తర్వాత గంట గ్యాప్ ఇచ్చి ఏదో ఒక కర్రీతో చేసిన జొన్న రొట్టెలు తింటుంది. ఆ తర్వాత లంచ్ కు 2 గంటల ముందు ఏదైనా ఒక ఫ్రూట్ ఉంటుంది. ఇక మధ్యాహ్న భోజనంలో భాగంగా పప్పు, అన్నం, కూరగాయలు తింటుంది.
సాయంత్రం ఏదైనా టోస్ట్ లేదా శాండ్ విచ్ తింటుంది. ఇక డిన్నర్ లో మధ్యాహ్నం తిన్న భోజనమే రిపీట్ చేస్తుంది. రోజంతా మధ్యమధ్యలో ప్రొటీన్ షేక్ లేదా కొబ్బరి నీళ్లు తాగుతుంది. వీటికి అదనంగా పొద్దున్న, సాయంత్రం ఎర్ల్-గ్రే టీ తాగుతుంది. కాజల్ పూర్తిగా శాకాహారి. కాబట్టి ఆమె ప్రొటీన్ షేక్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.
తనకు రాజ్మా చావల్, పన్నీర్, అమ్మ చేసే పరాఠాలు ఇష్టమంటోన్న కాజల్.. ఆంధ్రా వంటకాలు కూడా ఇష్టమని చెబుతోంది. ప్రతి రోజూ తన మెనూలో ఫైబర్, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు ఉండేలా జాగ్రత్త పడతానంటోంది. ఇక బ్యూటీ సీక్రెట్స్ విషయానికొస్తే.. ఐఎస్ అనే బ్రాండ్ కు చెందిన సౌందర్య ఉత్పత్తుల్ని మాత్రమే వాడుతుందట కాజల్.