ఈ సార్వత్రిక ఎన్నికల ఎపిసోడ్ మొత్తమ్మీద – జనసేనాని… మా దేవుడు… సీఎం సీఎం అని అరిపించుకున్న పవన్ కల్యాణ్ – చివరాఖరికి అందరి జాలిని బంపర్ మెజారిటీతో గెలుచుకొన్నాడు. అధికార పీఠం నుంచి నిర్దాక్షిణ్యంగా నెట్టివేయబడ్డ చంద్రబాబు మీద కూడా ఏ ఒక్కరూ అయ్యో పాపం అనడం లేదు. కానీ పవన్ కల్యాణ్ మీద మాత్రం జీవిత, రాజశేఖర్ లు కూడా జాలి కురిపిస్తున్నారు.
గాజువాక, భీమవరంల్లో పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఘోరంగా దెబ్బ తిన్నారు. పవన్ నామినేషన్ వేసిన రోజు నుంచీ భీమవరంలో గెలవడు అని బల్ల గుద్ది మరీ చెప్పినవాళ్లు కూడా… గాజువాకలో అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకున్నారు. ఆయన కూడా తనకు గాజువాక బాగా సేఫ్ అని లెక్కలు వేసుకున్నారు. తన సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్నాయి కాబట్టి విజయం సులభం అనుకున్నారు. అక్కడ భీమవరం కంటే ఎక్కువ మార్జిన్ తో ఓటమి పాలయ్యారు.
ఉత్తరాంధ్రను అభివృద్ధికి అవతరించిన కలి పురుషుడిని అన్న రేంజులో ఉపన్యాసాలు దంచిన పవన్ కల్యాణ్ ను ఆ మూడు జిల్లాలు కనీసం విశ్వసించ లేదు. ఈ వాస్తవం ఫలితాల రూపంలో వెండి తెర మీద సాక్షాత్కరించింది.
గాజువాకలోనే ఉంటాను అని అక్కడి ఓటర్లను నమ్మించేందుకు అక్కడ ఇల్లు కూడా తీసుకున్న పవన్ కల్యాణ్ ను ఏ మాత్రం పట్టించుకోకపోవడానికి కారణాలు వెదికితే…
గతంలో ప్రజారాజ్యం గెలిచిన సీటు అది. దానికి తోడు కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, తమ పార్టీ సభ్యత్వాలు ఎక్కువగా నమోదయ్యాయి లాంటి లెక్కలతో పవన్ గాజువాక గోదాలోకి వచ్చారు. 2009 కీ 2019 కీ ఓటర్ల ఆలోచనలు, ఆకాంక్షలు మారిపోయాయి అనే స్పృహ జనసేనానిలోగానీ, ఆయన కోటరీలోగానీ లేదు. నాకు కులం లేదు, మతం లేదు అంటూ ధర్మపన్నాలు చెప్పిన సేనాని చివరకు కాపు ఓట్లు లెక్కలు చూసుకొని గాజువాక బాటపట్టారు. అయితే తన కులం…. ప్రజారాజ్యం ఎఫ్ఫెక్ట్ తరవాత మెగా ఫ్యామిలీని రాజకీయంగా నమ్మడం లేదు అని గ్రహించలేకపోయారు.
2014 లో తన వల్లే కాపులంతా టీడీపీకి పట్టం కట్టారు అనే భ్రమల్లోనే పీకే ఉండిపోయారు. నాడు చంద్రబాబు ఇచ్చిన అబద్దపు హామీలను అందరితోపాటు కాపులూ నమ్మారు… ముఖ్యంగా కాపులను బీసీల్లో చేరుస్తాను అనే అబద్దం వల్లే టీడీపీకి ఓటు వేశారు అనే విషయం పీకే ఎప్పటికీ గ్రహిస్తాడో ఏమిటో?
ఇక పార్టీ సభ్యత్వాలు అనేది జనసేనలో ఒక ప్రహసనం. 2018 మార్చి 14 న మంగళగిరిలో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వం అన్నారు. ఆ తరవాత ఓ మహిళా నేత అధ్వర్యంలో ఈ హడావిడి నడిపారు. తరవాత సభ్యత్వాల నమోదు అన్నారు. గాజువాక టికెట్ ఆశించిన నేతలు ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకొని భారీగా పార్టీలో సభ్యత్వాలు ఇచ్చారు. ఈ వాపు చూసి బలుపు అనుకొని స్వయంగా పార్టీ అధ్యక్షుడే బొక్క బోర్లా పడటం విధి వైచిత్రి.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, ఇతర పరిశ్రమల కార్మికులు ఉన్నారు.. ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి… కమ్యూనిస్టుల బలం కలిసి వస్తుంది అనుకొంటే అది కూడా జరగలేదు. స్టీల్ ప్లాంట్ భూముల పరిహారం, అందుకు సంబంధించి రైతుల సమస్యలపై కూడా పవన్ గందరగోళంగా మాట్లాడారు. అక్కడి రైతులు అడుక్కు తింటున్నారు అన్న విధంగా పదేపదే చెప్పడంతో వారు అవాక్కయ్యారు. స్థానిక సమస్యలపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడటం, గాజువాకకు టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం మీద పెదవి విప్పకపోవడంతో పవన్ కు ఓటు వేయడం వృథా అని ఫిక్స్ అయ్యారు.
అక్కడ కాపులే కాదు యాదవ, ఇతర బీసీ కులస్తులూ ఉన్నారు. తెలుగు దేశం బి టీం లా మారిన జనసేనను ఆ వర్గాలు వ్యతిరేకించాయి. యాదవ కులస్తుడైన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ రావుని దెబ్బ తీసేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యవహరించారు అనే కోపం బీసీల్లో కమ్ముకొంది. పల్లాకు మద్దతుగా చంద్రబాబు గాజువాకలో కనీసం ప్రచారం చేయలేదు. ఇందుకు కృతజ్ఞతగా పవన్ కూడా మంగళగిరి వైపు కన్నెత్తి చూడలేదు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ను అర్థం చేసుకున్న గాజువాక ఓటరు ఏ మాత్రం జనసేనను నమ్మలేదు.
ఇక విశాఖ భూ కుంభకోణాలపై విరుచుకుపడి నానా హడావిడి చేసిన పవన్ కల్యాణ్ మాటల్లో నిజాయతీ లేదని గాజువాక వాళ్ళు గ్రహించారు. ఈ కుంభకోణాల్లో ఎవరి పేరు అయితే ప్రధానంగా వినిపించిందో ఆ వ్యక్తినే పవన్ కావలించుకొని పార్టీ కండువా కప్పి అనకాపల్లి సీటు కూడా ఇచ్చారు. అతనే… పరుచూరి భాస్కర్ రావు. మాజీ మంత్రి గంటాకు బంధువు ఇతను. గంటా వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ చక్కపెట్టేది పరుచూరి అనే విషయం విశాఖ జిల్లా అంతా తెల్సు. గంటాకు గంట మోగిస్తా, తాట తీస్తా అంటూ చెప్పిన మాటలన్నీ సినిమా డైలాగులే అని గాజువాక వాళ్ళు గ్రహించారు.
ఈ నియోజకవర్గం పరిధిలో ఎన్నో భూ కుంభకోణాలు ఉన్నాయి. మరెన్నో భూములు సివిల్ వివాదాల్లో చిక్కుకున్నాయి. వీటికి పరుచూరి అండ్ గంటా బ్యాచు కారణమని ఆ ప్రాంతవాసులు చాన్నాళ్లుగా గగ్గోలుపెడుతున్నారు. గంటా సహచర మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా ఈ విషయాన్ని ఎన్నోసార్లు ప్రభుత్వానికి చెప్పారు. ఈ భూములు చాలామటుకు మధ్య తరగతి వాళ్ళవీ, చిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులవే. ఈ వర్గాలు ఏవీ పవన్ మాటలను నమ్మలేదు.
యువ ఓటర్ల మీద ఆశలుపెట్టుకున్న పవన్ కు ఆ వర్గం నుంచి కూడా దన్ను దక్కలేదు. విశాఖలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం, జల్లికట్టు ఇన్సిపిరేషన్ అన్న పవన్ అసలు సమయానికి కాడి వదిలేసి విశాఖ వంక చూడలేదు. ఆ రోజు విశాఖకు వచ్చి ఎయిర్పోర్టులోనే పోలీసులచే నిలువరించబడి… రన్ వే మీద ధర్నాకు దిగింది ఎవరు అంటే విశాఖ యూత్ జగన్ గురించే చెబుతారు. ‘పవన్ ఆ రోజు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. ఆయనకంటే సంపూర్ణేష్ బాబు బెటర్’ అని ఆ యూత్ అంటారు. సరైన సమయంలో పారిపోయే వ్యక్తిని ఎలా నమ్ముతారు.
ఇక గాజువాకలో పవన్ కల్యాణ్ తరఫున పార్టీవాళ్ళు చేసిన ఎలక్షనీరింగ్, ప్రచారం గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంతా బెటర్. గాజువాకలో ఉన్న జనసేన నాయకులను కాదని పార్టీవాళ్ళు పై నుంచి కొందరు నాయకులు (?) హోటల్స్ లో మకాం వేసి… గాజువాక జనసేన నాయకుల్ని తమ దగ్గరకు రప్పించుకొని ఆదేశాలు ఇవ్వడం, తాము చెప్పిన విధంగా నడవాలి అనడంతో స్థానిక శ్రేణులు పవన్ తరఫున ఉత్సాహంగా పనిచేయలేదు. పైనుంచి వచ్చిన వారికి ఏ మాత్రం రాజకీయ అవగాహన లేకపోవడం, ఎలక్షన్ వ్యవహారాన్ని కూడా 10 టూ 5 జాబ్ లా చేయడం, సాయంత్రం చల్లబడ్డాక అక్కడక్కడా ప్రచారం చేయడం, బూత్ స్థాయిలో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొనే ఓపిక లేకపోవడంతో జనసేన ఊసే ఎవరికీపట్టలేదు. ఏతావాతా తనకు అనువైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొనే దశ నుంచి ఓటమి వరకూ జనసేనాని చేసిన తప్పులే అతనిపై అందరూ జాలిపడేలా చేశాయి.
(నెక్స్ట్…. భీమవరంలో గ్లాస్ ఎందుకు పగిలింది?)