హరీష్ శంకర్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తయారవుతున్న వాల్మీకి సినిమా నుంచి సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తప్పుకున్నారు. మిక్కీ జె మేయర్ వచ్చి చేరారు. ఈ విషయం బయటకు తెచ్చిన తరువాత, ఎందుకు వెళ్లాడు, ఎందుకు మార్చారు అంటూ బోలెడు కథనాలు వండి వార్చడం మొదలు పెట్టారు.
అయితే ఇక్కడ విషయం వడ్ల గింజలో బియ్యం గింజ అంత. అసలు సంగతి ఏమిటంటే, వాల్మీకి సినిమాలో హరీష్ శంకర్ ఓ రీమిక్స్ సాంగ్ ప్లాన్ చేసారు. అది ఏ పాట, ఏమిటన్నది తెలియాల్సి వుంది. కానీ అది ప్లాన్ చేసారు. అయితే ఇక్కడే సమస్య వచ్చింది.
దేవీశ్రీప్రసాద్ క్లియర్ గా చెప్పేసాడు. తాను రీమిక్స్ లు చేయనని, అది తన పాలసీ అని. కానీ హరీష్ శంకర్ వినలేదు. అన్నీ చేసి, ఆ ఒక్కటీ చేయనంటే ఎలా? సినిమాకు ఆ రీమిక్స్ చాలా అవసరం అని. దేవీశ్రీ మాత్రం ససేమిరా అన్నాడు. దాంతో అక్కడే దారులు వేరయ్యాయి. దేవీ మారిపోయాడు. మిక్కీ చేరిపోయాడు. అదీ సంగతి.