Bimbisara Review: మూవీ రివ్యూ: బింబిసార

టైటిల్: బింబిసార రేటింగ్: 2.5/5 తారాగణం: నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మాజి, ప్రకాశ్ రాజ్, అయ్యప్ప శర్మ తదితరులు కెమెరా: చోటా…

టైటిల్: బింబిసార
రేటింగ్: 2.5/5
తారాగణం: నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మాజి, ప్రకాశ్ రాజ్, అయ్యప్ప శర్మ తదితరులు
కెమెరా: చోటా కె నాయుడు
ఎడిటింగ్: తమ్మి రాజు
సంగీతం (బ్యాక్ గ్రౌండ్): ఎం.ఎం. కీరవాణి
సంగీతం (పాటలు): చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, కీరవాణి
నిర్మాత: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్
దర్శకత్వం: మల్లిడి వశిష్ట్
విడుదల తేదీ: 5 ఆగస్టు 2022

బింబిసారుడనగానే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటి మగథసామ్రాజ్యాధినేత గుర్తొస్తాడు. హిందీలో వైజయంతిమాల నటించిన “ఆమ్రపాలి”లో సునీల్ దత్ పోషించింది అజాతశత్రు పాత్ర. ఆ అజాతశత్రు తండ్రే బింబిసారుడు. అది చరిత్ర.

టైటిల్ చూసి ఇది ఆ చారిత్రాత్మక చిత్రమేమో అనుకుంటే పొరపాటే. దానికి, ఈ సినిమాకి ఏ సంబంధమూ లేదు. సౌండింగ్ బాగుందనో, హిస్టారికల్ పేరైతే క్యాచీగా ఉంటుందనో ఈ టైటిల్ పెట్టారు తప్ప ఇంకేం కాదు. సింపుల్ గా చెప్పాలంటే రాజమౌళి తీసిన ఆర్.ఆర్.ఆర్ కి అల్లూరి సీతారామరాజుకి, కొమురం భీం కి ఎంత సంబంధముందో ఇదీ అంతే.

ట్రైలర్ చూస్తే మగధీరని, బాహుబలిని చూసి అనుకరించినట్టుందని చాలామందికి అనిపించింది. అయినా కూడా కళ్యాణ్ రామ్‌ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని కోరుకున్న వారూ లేకపోలేదు.

ఇంతకీ ఇందులో ఏముందో, ఎలా ఉందో చెప్పుకుందాం.

క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దంలో అత్యంత కౄరుడైన త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడు.ఆక్రమణలతో రాజ్యాన్ని విస్తరించుకోవడం, ఎదురు తిరిగిన వాళ్లని హింసించడం, నచ్చకపోతే చిన్నకారణాలకే అమాయకుల్ని చంపేయడం అతని నైజం. మద్యం మరియు మగువలతో కాలం గడపడం అతని దినచర్య.

ఇదిలా ఉంటే మాయాదర్పణం అనే ఒక నిలువుటద్దం కథలోకొస్తుంది. దానికి కాలాలను కలిపే శక్తుంటుంది. ఆ సంగతి బింబిసారుడికి తెలియదు.

ఒక సందర్భంలో నరరూపరాక్షసుడు లాంటి ఈ బింబిసారుడు దైవాన్ని కూడా ధిక్కరిస్తాడు. తనని లొంగదీయగలిగే శక్తి సృష్టిలోనే లేదంటాడు. ఒక చిన్న పిల్లని మదమెక్కి చంపేస్తాడు.

ఆ తర్వాత ఒకడు ఆ బింబిసారుడిని ఒక్క తన్ను తంతే ఆ మాయాదర్పణంలో పడి మన కాలాంలోకొచ్చి పడతాడు.

అక్కడి నుంచి ఈ కొత్త కాలంలో అతను పడే కష్టాలు, అతనిలో చోటు చేసుకున్న మార్పు మిగిలిన కథ.

ఈ కథలో పాయింట్ కొత్తగా అనిపిస్తుంది కానీ, అ పాయింటుకి, కథనానికి అన్నింటికీ రకరకాల సినిమాల నుంచి స్ఫూర్తి ఉంది.

రాజులకాలం, ప్రస్తుతకాలం మధ్యన కథనగానే “మగధీర” గుర్తొస్తుంది. అందులో రావురమేష్ పాత్రలాగ ఇందులో అయ్యప్పశర్మ పాత్రుంది. అక్కడ విలన్ లాగానే ఇక్కడా ప్రస్తుత కాలంలో విలనుంటాడు. అయితే మగధీర పునర్జన్మల కాన్సెప్ట్. ఇది అలా కాదు.

ఉన్నపళంగా ఒకానొక కాలానికి చెందిన వ్యక్తి వేరే కాలంలోకి వెళ్లడమనే కాన్సెప్ట్ ఈ మాధ్య జెర్మన్ వెబ్ సిరీస్ “డార్క్” లో పాపులరయింది. మనుసులు ఒక సొరంగం ద్వారా వేరు వేరు కాలాల్లోకి వెళ్లిపోతుంతారు ఈ సిరీస్ లో. ఇలాంటి ఐడియాతో నైజీరియన్ చిత్రం “డే ఆఫ్ డెస్టినీ” వచ్చింది. అందులో ఒక మెజీషియన్ ద్వారా పాత్రలు ఒక కాలంలోంచి ఇంకో కాలనికి వెళ్తారు. అలాగే ఇందులో మాయాదర్పణం ద్వారా కాలాల మధ్య ప్రయాణం చేస్తుంటుంది ప్రధానపాత్ర.

బాహుబలి స్ఫూర్తైతే అడుగడుగునా కనిపిస్తుంది ఇందులో. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్‌ సభలోకి నడుచుకుంటూ వచ్చేటప్పుడు పాదాల దగ్గర పెట్టిన కెమెరా యాంగిల్, ఒక పాత్రని హఠాత్తుగా కత్తితో తలనరకడం, చివరికి దర్జాగా కూర్చుని చచ్చిపోవడం ఇలా చాలా ఘట్టాలు బాహుబలిని గుర్తుచేస్తాయి. అయితే భళ్లాలదేవుడి పాత్రలాగ మొదలయ్యి చివరికి అమరేంద్ర బాహుబలిగా ముగుస్తుంది కళ్యాణ్ రామ్‌ క్యారెక్టర్.

అన్నట్టు ఒకానొక చోట ధన్వంతరిపురం అనే ఊరి ఎపిసోడ్ వస్తుంది. అదేంటో గానీ ఒక్క క్షణం “ఆచార్య”లోని పాదఘట్టం గుర్తొచ్చి కంగారుపెట్టింది. కానీ అంతలోనే సర్దుకుని కథ ఆ దిశగా వెళ్లకుండా ట్రాకు మారింది.

అలాగే “యమగోల”, “యమలీల” సినిమాల్లో యముడు, చిత్రగుప్తుడు భూలోకానికి వచ్చినట్టు ఇందులో కూడా అలాంటి సీన్స్ రిపీటైనట్టు అనిపించాయి.

పాయింట్ పరంగా బాగానే అనిపించినా ట్రీట్మెంటులో కానీ, సన్నివేశలు కన్సీవ్ చెయడంలో కానీ ఒరిజినాలిటీ చూపించలేదు. ఆల్రెడీ చూసేసిన పెద్ద సినిమాల తరహా సీన్లొస్తుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది తప్ప అద్భుతమనిపించదు.

సాంకేతికంగా ఉన్నంతలో బాగానే తెరకెక్కించారు. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ చీప్ గా అనిపించినా చాలా చోట్ల బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.

పాటలు మాత్రం పెద్ద గుర్తుండేలా, హం చేసుకునేలా లేవు. అయితే “ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడి..” అనే పాట మాత్రం సందర్భోచితంగా చూస్తున్నప్పుడు ఆకట్టుకుంది. ఆ పాటకి చేసిన ఎడిటింగ్ కూడా బాగుంది. “గులేబకావళి అందం..” మాత్రం పాత తరహా ఆర్కెస్ట్రాలా వినిపిస్తుంది.

ప్రధమార్థంలో చాలా సేపటి వరకు తెర మీద సన్నివేశాలు మారుతుంటాయి తప్ప ఎమోషన్ అందదు. నెమ్మదిగా కథ అందుకుని ఇంటర్వల్ బ్యాంగ్ కి వచ్చేసరికి ఎమోషనల్ గా మారుతుంది. సెకండాఫ్ కూడా మరీ ప్రెడిక్టబుల్ గా కాకుండా ప్యారలెల్ వర్డ్ల్స్ టైప్ లో ప్యారలల్ టైం లో జరిగే సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. అయితే వీటికీ ఈ మధ్యన వచ్చిన “ప్లే బ్యాక్” కి కొంచెం పోలికలు కనిపిస్తాయి.

రొటీన్ రొట్టకొట్టుడు కాకుండా కొత్తగా ఆలోచించి మల్టిపుల్ జానర్ సినిమా తీయాలనుకున్న ఐడియాని మెచ్చుకోవాలి. అయితే స్క్రిప్ట్ దగ్గరే ఇంకా కసరత్తు చేసి సన్నివేశ రూపకల్పనలోనూ, డయలాగ్స్ విషయంలోనూ ఇంకా ఫోకస్ పెట్టుంటే గొప్ప సినిమా అయ్యుండేది. ఫైట్స్ విషయంలో కూడా వైవిధ్యం మిస్సయ్యింది. ప్రతి వాడు తంతే గోడకెళ్లి గుచ్చుకోవడం మళ్లీ మళ్లీ రిపీటయ్యే సరికి యాక్షన్ కోరియోగ్రఫీలో భావదారిద్ర్యం కనిపిస్తుంది.  

కళ్యాణ్ రామ్‌ కష్టాన్ని మెచ్చుకోవచ్చు. ద్విపాత్రాభినయంలో చక్కని వైవిధ్యం కూడా చూపించాడు. కానీ అక్కడక్కడ అవసరానికి మించి అరిచినట్టు లౌడ్ గా అనిపించింది. క్యాథరీన్ మాత్రం లావుగా ఉన్నా ఆ పాత్ర వరకు సరిపోయింది. అయ్యప్ప శర్మ ఓకే. మిగిలిన వాళ్లంతా తమతమ పాత్రల్లో మమ అనిపించారు తప్ప ప్రత్యేకమైన మెరుపులు మెరిపించలేదు. దర్శకత్వపరంగా ప్రస్తుత స్టాండర్డ్స్ ని దృష్టిలో పెట్టుకుంటే యావరేజని చెప్పాలి. ఇలాంటి సినిమాలకు పని చేసేటప్పుడు ఇంకా సాన పెట్టాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ నిరుత్సాహపరచకుండా తీసిన సినిమా ఇది.

ఎలా చూసుకున్నా పలు సన్నివేశాల్లో ఒరిజినాలిటీ లోపించడమే ప్రధానమైన మైనస్. ఎలాగో లాస్ట్ సీన్లో సీక్వెల్ కి సంకేతమిచ్చారు కనుక దాంట్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మెండుగా ఉంది.

అద్భుతం కాదు.. అలాగని విసిగించదు. సోషియో ఫ్యాంటసీ సినిమాలు నచ్చేవాళ్లు ఒకసారి ట్రై చేయొచ్చు.

బాటం లైన్: భల్లాలదేవుడు బాహుబలైతే!