‘ఫ్రంట్’ ఫైట్ కి దూరమంటున్న ‘బ్యాక్’ స్టాబ్ బాబు

దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ప్రస్తావన ఎప్పుడొచ్చినా చంద్రబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 2019 ఎన్నికల సమయంలో కూడా అన్నిపార్టీలను ఏకం చేసి చక్రం తిప్పారు బాబు. ఏపీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం,…

దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ప్రస్తావన ఎప్పుడొచ్చినా చంద్రబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 2019 ఎన్నికల సమయంలో కూడా అన్నిపార్టీలను ఏకం చేసి చక్రం తిప్పారు బాబు. ఏపీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, ఢిల్లీ సీఎంలను సైతం పిలిపించి ప్రచారం చేపట్టారు. అంతకు ముందు ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు కూడా బాబు ప్రచారం చేసి పెట్టారు. అయితే మోదీతో కయ్యం ఖరీదు బాబుకి బాగా తెలిసొచ్చింది. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో చంద్రబాబు పరిస్థితి దారుణంగా తయారైంది.

ఇప్పుడు మరోసారి దేశంలో థర్డ్ ఫ్రంట్ ప్రస్తావన వచ్చింది. కాంగ్రెస్ ఆ కూటమిలో ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, కింగ్ మేకర్ అనదగ్గ శరద్ పవార్, కింగ్, క్వీన్ అనిపించుకోవాలని తహతహలాడుతున్న కేజ్రీవాల్, మమతా బెనర్జీ పార్టీల తరపున కూడా థర్డ్ ఫ్రంట్ మీటింగ్ కి హాజరు పడింది. రాగా పోగా దక్షిణాది పార్టీలు ఆ మీటింగ్ కి దూరంగా ఉన్నాయి.

కేసీఆర్, జగన్, స్టాలిన్ దూరంగా ఉన్నారంటే ఓ అర్థముంది. వారు మొదటినుంచీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా.. ఇతర పార్టీలతో కూడా సమ దూరం పాటిస్తున్నారు. అందులోనూ కాంగ్రెస్ తో కలసిన కూటమి అంటే వైసీపీ, టీఆర్ఎస్ కి అస్సలు పడదు. మరి జగన్, కేసీఆర్ కి శత్రువులు అంటే, చంద్రబాబుకి మిత్రులనేకదా అర్థం. అయినా కూడా బాబు థర్డ్ ఫ్రంట్ విషయంలో జోక్యం చేసుకోదలుచుకోలేదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకునే టీడీపీ జాతీయ అధ్యక్షుడు మౌనం వెనక చాలా మతలబే ఉంది.

మోదీతో వైరం ఎందుకు..?

గతంలో ఫ్రంట్ అంటే చాలు.. ఫ్రంట్ లైన్ లో నిలబడే బాబు, ఇప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ గా మారిపోయారు. ఒకవేళ ఫ్రంట్ లెక్కలు తేడాకొట్టి మోదీ మరోసారి అధికారంలోకి వస్తే, బాబు చావుదెబ్బ తిన్నట్టే. మిగతా పార్టీలన్నీ ఆయా రాష్ట్రాల్లో కోలుకుంటాయి కానీ, టీడీపీ పరిస్థితే తేడా కొడుతుంది. 

అందుకే బీజేపీతో కోరి వైరం తెచ్చుకోవడం బాబుకి ఇష్టంలేదు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీని తీవ్రంగా విమర్శించిన ఆయన, ఇప్పుడు పూర్తి సైలెంట్ గా ఉన్నారంటే, పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఊసరవెల్లి లెక్కలు అప్పుడే తేలవు..

థర్డ్ ఫ్రంట్ కి దూరంగా ఉన్నాడు కాబట్టి, చంద్రబాబుపై బీజేపీ సింపతీ చూపించే పరిస్థితి లేదు. ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చే బాబు.. వచ్చే ఎన్నికలనాటికి తన అసలు రంగు చూపించే అవకాశం ఉంది. 2024నాటికి మోదీకి ఛాన్సే లేదని డిసైడ్ అయితే మాత్రం మళ్లీ ''ఫ్రంట్''కు దూకుతారు బాబు. 

అసలు థర్డ్ ఫ్రంట్ ఐడియా నాదే అనే రేంజ్ లో చక్రం తిప్పుతారు. ఒకవేళ అప్పటికి గాలి బీజేపీకి అనుకూలంగా వీస్తుంది అనుకుంటే.. ఏపీలో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి కోసం విశ్వప్రయత్నాలు చేస్తారు. అదీ బాబు ఊసరవెల్లి లెక్క.