సినీ క్రిటిక్, బిగ్‌బాస్ ఫేం కత్తి మహేశ్ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై మహేశ్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు… లారీని వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో మహేశ్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.
ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో మహేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మహేశ్ ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు కావడం చూస్తే …ఆయన ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న మహేశ్‌కు అమాంతం పాపులారిటీ పెరిగింది. ప్రధానంగా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌పై విమర్శలు, అందుకు మీడియాలో పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన ఓ సెలబ్రిటీ స్టేటస్ పొందారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనదైన స్టైల్లో రాజకీయ, సామాజిక అంశాలు, సమస్యలపై కత్తి మహేశ్ స్పందిస్తుంటారు. కత్తి మహేశ్‌కు ప్రాణాపాయం తప్పడంతో ఆయన స్నేహితులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.