వైసీపీలో ఆయన దూకుడు చేసే మంత్రి. చంద్రబాబు మీద విమర్శలు చేయడంతో ముందుంటారు. బలమైన సామాజిక వర్గం నేపధ్యం, రాజకీయ కుటుంబం, అన్నింటికీ మించి విశాఖ జిల్లా మూలవాసి కావడం ఆయనకు బలాలు. ఆయనే గుడివాడ అమరనాధ్. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిపోయారు.
దాంతో సొంత పార్టీలోనే ఆయనకు ప్రత్యర్ధులు ఉన్న్నారన్న ప్రచారం ఉంది. ఇక చీటికి మాటికీ అయినదానికీ వారే ఆయన్ని బదనాం చేసే పనులను తెరచాటుగా చేస్తున్నారు అని అంటున్నారు. కొత్త జిల్లా అనకాపల్లిలో ఏం జరిగినా యువ మంత్రిదే బాధ్యత అని సొంత పార్టీ వారే తమ అనుకూల మీడియాలో రాతలు రాయిస్తూ విపక్షానికి ఉప్పు అందిస్తున్నారు అని గుడివాడ అనుచరులు మధనపడుతున్నారు.
యువకుడు, జోరెక్కువ కావడంతో గుడివాడ కొన్ని విషయాల్లో పడుతున్న తడబాట్లు కూడా ప్రత్యర్ధులకు కలసివస్తున్నాయి. ఇదిలా ఉంటే గుడివాడ మంత్రి అయిన రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు సొంత జిల్లాలోని పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనలు జరిగాయి. దాంతో మంత్రిని పట్టుకుని విపక్షాలు ఎలాగూ విమర్శలు సంధిస్తున్నాయి. ఆయన అసమర్ధత కారణంగానే ఇలా జరుగుతోందని టీడీపీ లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఇక సొంత పార్టీలో కొందరు నాయకులు సైతం బయటకు కనబడకుండా మంత్రిని ఇరకాటంలో పెడుతున్నారు. గుడివాడ మీద అక్కసుతోనే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. గుడివాడ రాజీనామా చేయాలని టీడీపీ అంటోంది. విపక్షాలను దీటుగా ఎదుర్కొంటున్న ఈ యువ మంత్రికి సొంతింట ఇబ్బందులు తప్పేట్లు లేవు అంటున్నారు.