కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుందనే అందరూ అనుకుంటున్నారు. జరగడానికి అంత అవకాశం ఉందో, జరగకపోవడానికీ అంతే అవకాశం ఉంది. ఉప ఎన్నిక జరగాలా వద్దా అనేది టీఆర్ఎస్ వ్యూహాన్ని బట్టి ఉంటుంది. ఉప ఎన్నిక జరగకపోవడానికి రెండు అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి ముందస్తు ఎన్నికలు. రెండోది స్పీకర్ రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించకపోవడం. రాజీనామా చేయగానే దాన్ని తప్పనిసరిగా ఆమోదించాలని రూలేమీ లేదు. గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.
సరే …ఆ విషయాన్ని అలా పక్కన పెడితే, మునుగోడు ఉప ఎన్నిక జరిగితే అది కాంగ్రెస్ పార్టీకే అగ్నిపరీక్ష. మునుగోడు టీఆర్ఎస్ నియోజకవర్గం కాదు. అక్కడ ఆ పార్టీ ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వం కూలిపోదు. టీఆర్ఎస్ బలం తగ్గదు. ఉప ఎన్నిక లో బీజేపీ గెలిస్తే ఆ పార్టీకి ఒక స్థానం అదనంగా చేరుతుంది. అంతే తప్ప ఆ పార్టీ బలం అనూహ్యంగా పెరిగే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ ఆ స్థానాన్ని తప్పనిసరిగా ఎందుకు గెలుచుకోవాలంటే … ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ పార్టీకి నిన్నటివరకు ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మునుగోడు. అక్కడ ఓడిపోతే ఉమ్మడి జిల్లా నుంచి అసెంబ్లీలో దానికి ప్రాతినిధ్యం ఉండదు.
కాబట్టి టీఆర్ఎస్, బీజేపీ కంటే ఆ పార్టీ ఎక్కువగా పోరాటం చేయాల్సి ఉంటుంది. అలాగే మునుగోడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సామర్ధ్యానికి కూడా పరీక్ష. ఇప్పటివరకు నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాద్, హుజూర్ నగర్ మొదలైన చోట్ల పార్టీ ఓడిపోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకుగాను తొమ్మిదింటిలో గులాబీ పార్టీ గెలుపొందగా… హుజూర్‌నగర్, నకిరేకల్, మునుగోడుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. హుజూర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి గెలుపొందడంతో ఆయన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు.
దీంతో 2019 అక్టోబరులో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది ఎంపీ ఎన్నికలకు ముందే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో ఉమ్మడి జిల్లా నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడుతో పాటు నకిరేకల్, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో పార్టీపై ఏ మేరకు ప్రభావం ఉంటుందోనని టీపీసీసీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
గతంలో రాజగోపాల్‌రెడ్డి భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా పనిచేయడంతో ఆ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. తాజాగా పార్టీకి రాజీనామా చేయడంతో ఆయనతో పాటు వెళ్లేదెవరనే దానిపై మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాల వారీగా పార్టీలో ఉండేవాళ్లేవరు, రాజగోపాల్‌రెడ్డి వెంట వెళ్లేవాళ్లేవరనే దానిపై పీసీసీ ఇప్పటికే సమగ్ర సమాచారం సేకరించినట్లు సమాచారం.