కేంద్రం వైఖరి దుర్మార్గం కాదా?

పేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.. లేదా.. వాళ్లు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ఉపయోగపడేలా మంచిగా ఆర్థిక సహాయం చేయాలి. కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇది ఒక లక్ష్యం. ఇందుకోసం రెండు ప్రభుత్వాల…

పేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.. లేదా.. వాళ్లు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ఉపయోగపడేలా మంచిగా ఆర్థిక సహాయం చేయాలి. కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇది ఒక లక్ష్యం. ఇందుకోసం రెండు ప్రభుత్వాల వద్దకూడా ప్రణాళికలు ఉన్నాయి. ఆలోచనలు ఉన్నాయి. 

అయితే  ఒక్క చెయ్యి గాలిలో ఊపినంత మాత్రాన చప్పట్లు మోగవు.. చప్పుడు రాదు అన్నట్టుగా.. ఒక్క ప్రభుత్వం అనుకున్నంత మాత్రాన పేదలకు పక్కా ఇళ్లు తయారు కావు. కానీ.. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా దుర్మార్గంగా కనిపిస్తోంది.

తాము ఇస్తున్న సొమ్ములతో నిర్మించే ఇళ్లకు తమ పేరు తప్ప మరొకటి ఉండడానికి వీల్లేదని వాదించడం ధర్మసమ్మతంగా లేదు. స్థలానికి ఇతర మౌలిక వసతులకు మేం కూడా నిధులిస్తాన్నం కదా… అనే రాష్ట్ర ప్రభుత్వపు విజ్ఞప్తిని పట్టించుకోకపోవడం వారి పెత్తందారీ పోకడలకు పరాకాష్టగా ఉంది.

కేంద్రం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి  నిధులు ఇస్తుంది. పల్లెలు, పట్టణాలు అనే ప్రాంతాన్ని బట్టి.. 1.80 లక్షల వరకు రకరకాలుగా కేటాయిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను కొనుగోలు చేసి, మౌలిక వసతులు కల్పిస్తూ కేంద్రం ఇచ్చే డబ్బులకన్నా ఎక్కువగానే ఖర్చు పెడుతూ ఉంటుంది. ఉభయతారకంగా ఇరుప్రభుత్వాలకు క్రెడిట్ దక్కేలాగా ప్లాన్ చేశారు.కేంద్రం ప్రకటించిన పేరుకు తోడు.. వైఎస్సార్ పేరు, కలిపారు. నవరత్నాల లోగో కూడా కలిపారు. అయితే.. ఈ వ్యవహారంపై కేంద్రం గుస్సా అవుతోంది.

మాకేంద్రపథకం పేరు మాత్రమే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం పథకాల పేర్లు గానీ లోగోలు గానీ పెట్టడానికి వీల్లేదు అని హుకుం జారీ చేసింది. అలా చేసినట్లయితే.. మీకు ఇచ్చే ఆ కాసిని సొమ్ములు కూడా ఇవ్వం అని చిక్కు ముడి పెట్టింది. కేంద్రం కేటాయించిన వాటిలో ఇప్పటికే అయిదు లక్షల ఇళ్లకు పైగా నిర్మాణం పూర్తి చేసేసి వాటి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తప్పని సరి పరిస్థితుల్లో వారు చెప్పినట్టుగా చేయాల్సి వస్తోంది. ఆ బోర్డులు మొత్తం మార్పిస్తున్నారు.

అయితే ఈ విషయంలో కేంద్రం దుర్మార్గం గా వ్యవహరిస్తున్నట్టు ప్రజలు విమర్శిస్తున్నారు. ఎందుకంటే కేంద్రం కేవలం 1.80 లక్షలు ఇచ్చినంత మాత్రాన ఇల్లు పూర్తవుతుందని అనుకోవడం భ్రమ. సొంత స్థలాలు ఉన్న పేదలను మాత్రమే దరఖాస్తు చేసుకోమంటే.. వారు కేటాయించిన 18.5 లక్షల కోటా ఎప్పటికీ పూర్తి కాదు.

రాష్ట్రప్రభుత్వం ఖాళీ భూములను కొనుగోలు చేసి మరీ పేదలకు పంచిపెడుతుండడం వల్ల మాత్రమే ఈ నిర్మాణాలు సక్సెస్ అవుతున్నాయి. అయితే కేంద్రం కీర్తి మొత్తం తమకు మాత్రమే దక్కాలనుకోవడం భావ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.