ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 లో విడిపోయి తెలంగాణాకు కేసీఆర్, ఆంధ్రాకు చంద్రబాబు ముఖ్యమంత్రులు అయినప్పుడు వారు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. జనాలకు అనేక మాయమాటలు చెప్పారు. వారికి అరచేతిలో వైకుంఠం చూపించారు. అంతన్నాడింతన్నాడే అని ఓ తెలుగు సినిమాలో పాట మాదిరిగా కబుర్లు చెప్పారు. ఆ రోజుల్లో ఇద్దరు చంద్రులు చెప్పినవన్నీ విదేశాల ముచ్చట్లే. ఏమిటీ విదేశాల ముచ్చట్లు ?
పాపం … ఏపీ ప్రజలు హైదారాబాదును పోగొట్టుకొని దిగులుగా ఉన్నారు కదా. దీంతో చంద్రబాబు అమరావతిని విదేశీ నగరం మాదిరిగా నిర్మిస్తానన్నాడు. అప్పట్లో ఆయన రాజధాని నగరాలు చూడటం కోసం అనేక దేశాలు తిరిగాడు కదా. ఏ దేశానికి వెళితే ఏపీని ఆ దేశం మాదిరిగా చేస్తాననేవాడు.
రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయా దేశాలను ఆహ్వానించేవాడు. అప్పట్లో అమరావతిని ఆ దేశం మాదిరిగా చేస్తానని, ఈ దేశం మాదిరిగా చేస్తానని ఎన్ని దేశాల పేర్లు చెప్పాడో లెక్కలేదు. చివరకు ఏదీ కాకుండా పోయింది.
ఇక తెలంగాణా సీఎం హైదరాబాదును మరింత అభివృద్ధి చేస్తానన్నాడు. అంతవరకూ చెప్పివుంటే బాగానే ఉండేది. డల్లాస్ మాదిరిగా చేస్తా, చికాగోలాగా చేస్తా, పాత బస్తీని ఇస్తాంబుల్ మాదిరిగా చేస్తా… ఈ విధంగా అనేక కతలు వినిపించాడు. నిన్న అంటే సోమవారం వరంగల్ వెళ్లి సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభించాడు.
సెంట్రల్ జైలు కూలగొట్టిన స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టాలనుకున్నాడు కదా. దానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ సమయంలో కేసీఆర్ కు కెనడా గుర్తొచ్చింది. అక్కడ అత్యుత్తమ వైద్య విధానం ఉందని, మనోళ్లు అక్కడికి పోయి దాన్ని స్టడీ చేసి వస్తే దాన్ని మించిన వైద్య విధానం తాను అమలు చేస్తానని చెప్పాడు.
ఇక ఎంజీఎం బిల్డింగ్ పాత బడి పోయిందట. దాన్ని కూలగొట్టి కొత్త బిల్డింగ్ కడతానన్నాడు. రెండు మూడు వేల కోట్లు ఖర్చైనా భరిస్తానన్నాడు. ఈ మధ్య చైనాలో 28 గంటల్లో 10 అంతస్తుల భవనం కట్టినట్లు మీడియాలో వచ్చింది కదా. ఆ బిల్డింగ్ కట్టిన చైనా వాళ్ళను తీసుకు రావాలన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో చంద్రబాబు బాగానే కతలు చెప్పాడు.
కేసీఆర్ ఇంకా అధికారంలో కొనసాగుతున్నాడు కాబట్టి జనం చెవుల్లో పూలు పెట్టేవిధంగా ఆయన కతలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాదులో ఓ అరగంట జోరుగా వానపడితే రోడ్లలో నదీ ప్రవాహంలా నీరు పారుతుంది. నాలాలు పొంగి పొర్లుతాయి. జనం పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.
ముందు ఈ సమస్య తీరిస్తే హైదరాబాదును విదేశం మాదిరిగా చేసినట్లే. హైదరాబాదును డల్లాస్ మాదిరిగానో, న్యూయార్క్ మాదిరిగా చేయక్కరలేదు. మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి చాలు.