కరోనా థర్డ్ వేవ్ ఉంటుందంటూ కొందరు వైద్య పరిశోధకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. సెకెండ్ వేవ్ లో విజృంభించిన కరోనా వైరస్ కొత్త మ్యూటేషన్ మూడో వేవ్ లో వ్యాపిస్తుందంటూ వారు అంచనాలు వేస్తున్నారు.
సెకెండ్ వేవ్ లో విజృంభించిన వైరస్ రకం డెల్టా అని, డెల్టా ప్లస్ వేరియెంట్ రాబోతోందని కొందరు చెబుతున్నారు. మరి కొందరు పరిశోధకులు ఏమో డెల్టా ప్లస్ వేరియెంట్ ఆల్రెడీ వచ్చేసిందని, ఇది డెల్టా కన్నా తీవ్ర ప్రమాదకారి కాదని అంటున్నారు. ఇలా రకరకాల విశ్లేషణలు, అంచనాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.
ఆ సంగతలా ఉంటే.. ఇంతకీ థర్డ్ వేవ్ ఎప్పుడు ఉండవచ్చనే అంశం గురించి కూడా విభిన్నమైన ప్రిడిక్షన్లు వినిపిస్తున్నాయి. అందులో ఒక అంచనా ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ సమయంలో ఇండియాలో కరోనా మూడో వేవ్ ఉండవచ్చని అంటున్నారు. కనీసం రెండు మూడు నెలల విరామం తర్వాతే మరో వేవ్ రావొచ్చని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ నుంచి కేసులు తగ్గుముఖం పట్టసాగాయి. అక్టోబర్, నవంబర్ నెలలు గడిచే సరికి కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గింది. డిసెంబర్ నెలలో ప్రజలు మాస్కులు తీసేశారు. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి వరకూ కూడా సౌత్ లో కరోనా ప్రభావం లేదు.
మహారాష్ట్ర మినహాయిస్తే మిగతా దేశంలో మార్చిలో కూడా కరోనా ప్రభావంత అంతంత మాత్రమే. ప్రజలు కూడా మాస్కులు ధరించడాన్ని అప్పుడు తప్పనిసరిగా చేయలేదు. ఏప్రిల్ నుంచి దేశమంతా కరోనా వ్యాప్తి తీవ్రం అయ్యింది. జూన్ నెలాఖరుకు ఈ వేవ్ ముగిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఈ పరిణామాల్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల తర్వాత కరోనా న్యూ వేరియెంట్ మరో వేవ్ లో వ్యాపించే అవకాశం ఉంటుందని కొన్ని అంచనాలున్నాయి. అయితే ఎయిమ్స్ చీఫ్ గులేరియా మాత్రం అంత గ్యాప్ ఇవ్వదు కరోనా అంటున్నారు. ఆరు నుంచి ఎనిమిది వారాల్లో ఇండియాలో కరోనా మరో వేవ్ లో విరుచుకుపడవచ్చని ఆయన చెప్పారు.
కరోనా ఇక వేగంగా రూపాంతరం చెందుతుందని, వేవ్ కూ వేవ్ కూ మధ్యన గ్యాప్ తగ్గుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. గరిష్టంగా ఎనిమిది వారాల్లోనే ఇండియా కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనాల్సి ఉంటుందని ఈ డాక్టర్ హెచ్చరిస్తున్నారు.
అన్ లాకింగ్ ప్రక్రియకు వేగంగా వెళ్లాల్సిన అవసరం లేదని, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్త చర్యలు పాటిస్తే మూడో వేవ్ ప్రభావం తక్కువగా ఉంటుందని, లేకపోతే తీవ్రంగా ఉంటుందని ఈ వైద్యుడు స్పష్టం చేస్తున్నారు.