పబ్ జీ ద్వారా ఓ భారతీయుడితో పరిచయం పెంచుకొని, ప్రేమలో పడి, ప్రియుడ్ని కలిసేందుకు, తన భర్తను విడిచి, నలుగురు పిల్లలతో కలిసి ఇండియా చేరుకున్న పాకిస్థానీ మహిళ, సీమా హైదర్ గురించి అందరికీ తెలిసిందే. ఆమధ్య వార్తల్లో హెడ్ లైన్స్ గా నిలిచింది సీమ. ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై సినిమా రాబోతోంది
కరాచీ టు నొయిడా అనేది ఈ సినిమా పేరు. దీనికి సంబంధించి తాజాగా ప్రకటన వచ్చింది. ఆ వెంటనే పోస్టర్ వచ్చింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఆడిషన్స్ కూడా మొదలయ్యాయి. జానీ ఫైర్ ఫాక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమిత్ జానీ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.
ఈ మూవీలో సీత పాత్ర కోసం ఆడిషన్స్ స్టార్ట్ చేశారు. సీమను పోలిన మధ్యవయష్కురాల కోసం యూనిట్ వెదుకుతోంది. నిజానికి ఈ పాత్ర కోసం సీమానే తీసుకోవాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల ఆమె ఇందులో నటించడానికి అంగీకరించలేదు. మరీ ముఖ్యంగా ఇందులో నటిస్తే చంపేస్తామంటూ ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి.
అయితే సీమ, మరో సినిమాలో నటించేందుకు అంగీకరించింది. “ఏ టైలర్ మర్డర్ స్టోరీ” అనే సినిమాలో ఆమె 'రా ఏజెంట్' గా కనిపించనుంది. ఇటు కరాచీ టు నొయిడా సినిమా కోసం కూడా సీమాను పోలిన నటి దొరికినట్టు సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాదిలోనే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
మరోవైపు సీమా హైదర్ అంశంపై ఇంకా తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. సరైన ఆధారాలు లేకుండా ఆమె ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిందనేది నిజం. కాకపోతే దీని ఆధారంగా ఆమెను తిరిగి పాక్ కు పంపిస్తే, అక్కడ ఆమెను హత్య చేసే ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయాన్ని మానవీయ కోణంలో ఆలోచించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే సీమాకు ఇండియాలో ఉండేందుకు అవకాశం ఇస్తే, ఇలాంటి ఉదంతాలు మరిన్ని రిపీట్ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భయపడుతోంది. ఆల్రెడీ శ్రీలంకకు చెందిన ఓ అమ్మాయి, చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఆరిమాకులపల్లెకు వచ్చేసింది. స్థానికుడ్ని పెళ్లి చేసుకొని కాపురం మొదలుపెట్టింది.