నా వ్యాఖ్య‌లు త‌ప్పే..ఉరి తీస్తారా తీయండి!

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఉభ‌య స‌భ‌లు స‌భ్యుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడికిపోయాయి. త‌న వ్యాఖ్య‌లు త‌ప్పేన‌ని కాంగ్రెస్ ఎంపీ క్ష‌మాప‌ణ చెప్పినా, బీజేపీ ఎంపీలు,…

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఉభ‌య స‌భ‌లు స‌భ్యుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడికిపోయాయి. త‌న వ్యాఖ్య‌లు త‌ప్పేన‌ని కాంగ్రెస్ ఎంపీ క్ష‌మాప‌ణ చెప్పినా, బీజేపీ ఎంపీలు, కేంద్ర‌మంత్రులు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని బీజేపీ ప‌ట్టుబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఒక ద‌శ‌లో స‌హ‌నం కోల్పోయిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ త‌న‌ను ఉరి తీయాల‌ని అనుకుంటే తీయొచ్చ‌ని చెప్పారు.

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల గురించి తెలుసుకుందాం. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విలో ఓ తోలు బొమ్మ‌ని కూర్చోబెట్టార‌న్నారు. ద్రౌప‌ది రాష్ట్ర‌ప‌తి కాద‌ని, రాష్ట్ర‌ప‌త్ని అని తీవ్ర అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ నోటి దురుసు బీజేపీ చేతికి ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. లోక్‌స‌భ‌లో మంత్రి స్మృతి ఇరానీ, రాజ్య‌స‌భ‌లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కాంగ్రెస్‌పై రెచ్చిపోయారు.

అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళను అవమానించడాన్ని సోనియా గాంధీ ఆమోదించారని స్మృతి ఇరానీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, స్త్రీ వ్యతిరేకి అంటూ విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు.  

రాజ్య‌స‌భ‌లో నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీల‌కు ఇష్టానుసారం మాట్లాడే స్వేచ్ఛ‌ను సోనియాగాంధీ ఇవ్వ‌డం వ‌ల్లే రాష్ట్ర‌ప‌తిని అవమానించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్ర‌ప‌తికి జ‌రిగిన అవ‌మానానికి సోనియా బాధ్య‌త వ‌హిస్తూ క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ పొర‌పాటున నోరు జార‌లేద‌న్నారు. ఉద్దేశ పూర్వ‌కంగానే ప‌దేప‌దే రాష్ట్ర‌ప‌తిని అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డ్డారు.  

ఈ విష‌య‌మై సోనియాగాంధీ స్పందించారు. రాష్ట్ర‌ప‌తిపై అభ్యంతర‌క‌ర వ్యాఖ్య‌లు చేశాన‌ని, అందుకు క్ష‌మాప‌ణ చెబుతూ అధిర్ రంజ‌న్ చౌద‌రి చేసిన ప్ర‌క‌ట‌నను ఆమె గుర్తు చేశారు. క్ష‌మాప‌ణ చెప్పిన త‌ర్వాత‌, అంత‌టితో ఆ విష‌యాన్ని వ‌దిలేయాల‌న్నారు. ఈ మొత్తం వివాదానికి కార‌ణ‌మైన అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర‌ప‌తిపై చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 

అయిన‌ప్ప‌టికీ బీజేపీ నేత‌లు చిన్న‌దాన్ని పెద్ద‌ది చేస్తున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తన వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే  తీయండంటూ బీజేపీ నేత‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉభ‌య స‌భ‌ల్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో వాయిదా వేశారు.