ప్ర‌జాకోర్టులో చేతులెత్తేసి…!

తిరుప‌తి కో-ఆప‌రేటివ్ బ్యాంక్ మేనేజింగ్ క‌మిటీ ఎన్నిక‌ల వివాదం హైకోర్టుకు చేరింది. ఈ నెల 20న జ‌రిగిన ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, ర‌ద్దు చేసి రీపోలింగ్ జ‌ర‌పాల‌ని కోరుతూ తిరుప‌తికి చెందిన 12 మంది…

తిరుప‌తి కో-ఆప‌రేటివ్ బ్యాంక్ మేనేజింగ్ క‌మిటీ ఎన్నిక‌ల వివాదం హైకోర్టుకు చేరింది. ఈ నెల 20న జ‌రిగిన ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, ర‌ద్దు చేసి రీపోలింగ్ జ‌ర‌పాల‌ని కోరుతూ తిరుప‌తికి చెందిన 12 మంది హైకోర్టులో పిటిష‌న్ వేశారు. న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించే హ‌క్కును ఎవ‌రూ కాద‌న‌రు. కానీ ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జాకోర్టు అంతిమంగా ఏ రాజ‌కీయ పార్టీ భ‌విష్య‌త్‌నైనా నిర్దేశిస్తుంది.

ప్ర‌జ‌ల తీర్పే ఫైన‌ల్‌. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొంద‌లేని ఏ ఒక్క‌రూ రాజకీయాల్లో రాణించ‌లేరు. ప్ర‌తి దానికి కోర్టును ఆశ్ర‌యించ‌డం టీడీపీకి ప్యాష‌నైంది. తిరుప‌తి కో-ఆప‌రేటివ్ మేనేజింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కోవ‌డంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పూర్తిగా విఫ‌ల‌మైంది. తిరుప‌తి టీడీపీలో తాము లేస్తే మ‌నుషులం కాద‌నే వాళ్లే అధికం. త‌మ పార్టీ అనుకూల మీడియా గొట్టాల వ‌ద్ద ప్ర‌త్య‌ర్థుల‌పై పులుల్లా చెల‌రేగిపోతుంటారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద మాత్రం ప్ర‌త్య‌ర్థుల‌ను చూడ‌గానే పిల్లుల్లా “మ్యావ్ మ్యావ్” అంటూ త‌ప్పించుకు తిరుగుతుంటారు.

ఈ విద్య‌లో మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ ఆరితేరారనే విమ‌ర్శ‌లున్నాయి. తిరుప‌తిలో భూక‌బ్జాలు, సెటిల్‌మెంట్లు, అన్ని ర‌కాల అసాంఘిక కార్య‌క‌లాపాలపై హ‌క్కుదారుడిని అల్లుడి రూపంలో ఇంట్లోనే పెట్టుకుని, ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేసే ద‌మ్ము, ధైర్యం సుగుణ‌మ్మ‌కు ఎక్క‌డిది? మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ కుటుంబ అక్ర‌మాల‌పై తిరుప‌తి వైసీపీ ఎందుక‌నో చూసీచూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ రాజ‌కీయ నాట‌కం ఒక ప‌ట్టాన ఎవ‌రికీ అర్థం కాదు.

తిరుప‌తి టౌన్ బ్యాంక్ ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌లాయ‌నం చిత్త‌గించి, ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న అయ్యింద‌నేది వాస్త‌వం. పోయిన ప‌రువును కాపాడుకునేందుకు ఇలా న్యాయ‌పోరాటాల పేరుతో స‌ర్క‌స్ ఫీట్లు వేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తిరుప‌తి వైసీపీ  ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అభిన‌య్‌రెడ్డి, వారి అనుచ‌రులు పులులు, సింహాలా? వాళ్లు కూడా మ‌నుషులే క‌దా?  

మ‌రెందుక‌ని వారిని ఢీకొట్ట‌డానికి తిరుప‌తి టీడీపీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మవుతున్నాయి. తిరుప‌తిలో వైసీపీ అక్ర‌మాల‌కు ఎదురొడ్డి పోరాడితే టీడీపీకి పోయేదేముంది? ఆ ప‌ని చేయ‌కుండా కాల‌యాప‌న ఎందుకు చేస్తున్న‌ట్టు? తిరుప‌తిలో రాజ‌కీయం ఎలా వుందంటే… “నువ్వు కొట్టినట్టు నటించు నేను ఏడ్చినట్టు నటిస్తా” అనే రీతిలో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య డ్రామా న‌డుస్తోంది. 

తాజాగా టీడీపీ న్యాయ‌పోరాటం రియ‌ల్ ఫైట్ అనుకుంటే… అలా న‌మ్మేవాళ్ల‌దే త‌ప్ప‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానిది త‌ప్పు కానే కాదు. ఎందుకంటే రీపోలింగ్ జ‌రిగింద‌నుకుందాం… అప్పుడు కూడా ఇదే వైసీపీ, టీడీపీ నేత‌లే క‌దా త‌ల‌ప‌డేది? అప్పుడు మాత్రం గెలుస్తామ‌ని టీడీపీ ఎలా అనుకుంటోంది? ఎవరిని వెర్రోళ్లు చేద్దామ‌నుకుంటున్నారు?