తెలుగు సూప‌ర్ హిట్ల‌.. మ‌ల‌యాళీ ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌!

మ‌ధురాన‌గ‌రిలో, పెద్ద‌రికం, హిట్ల‌ర్.. తెలుగు వారికి న‌చ్చిన సినిమాలు ఇవ‌న్నీ. తెలుగులో వేర్వేరు హీరోలు, ద‌ర్శ‌కులకు సంబంధించిన ఈ సినిమాల‌న్నింటికీ ఉన్న కామ‌న్ పోలిక ఏమిటంటే.. ఇవన్నీ మ‌ల‌యాళీ రీమేక్ సినిమాలు. వీటికి సంబంధించి…

మ‌ధురాన‌గ‌రిలో, పెద్ద‌రికం, హిట్ల‌ర్.. తెలుగు వారికి న‌చ్చిన సినిమాలు ఇవ‌న్నీ. తెలుగులో వేర్వేరు హీరోలు, ద‌ర్శ‌కులకు సంబంధించిన ఈ సినిమాల‌న్నింటికీ ఉన్న కామ‌న్ పోలిక ఏమిటంటే.. ఇవన్నీ మ‌ల‌యాళీ రీమేక్ సినిమాలు. వీటికి సంబంధించి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలో ఒక ద‌ర్శ‌కుడిది ముఖ్య పాత్ర‌. అత‌డే సిద్ధిక్. మ‌ల‌యాళీ స్టార్ డైరెక్ట‌ర్. ఈ వారంలోనే సిద్ధిక్ 68 యేళ్ల వ‌య‌సులో తుదిశ్వాస విడిచాడు. 

మ‌ల‌యాళంలో సిద్ధిక్-లాల్ ద్వ‌యం ద‌ర్శకులుగా ప్ర‌త్యేక‌మైన వారు. వీరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాలు కేవ‌లం తెలుగు, త‌మిళం, హిందీల్లో రీమేక్ అయ్యి సూప‌ర్ హిట్ గా నిలిచాయి. సిద్దిక్ తో పోలిస్తే లాల్ తెలుగు వారికి మ‌రింత‌గా ప‌రిచ‌యం. తెలుగులో, త‌మిళ అనువాద సినిమాలతో లాల్ విల‌న్ పాత్ర‌ల‌తో తెలుగులో మంచి గుర్తింపును క‌లిగి ఉన్నాడు. పందెంకోడి సినిమా తెలుగులో విడుద‌ల‌తో లాల్ కు న‌టుడిగా ఇక్క‌డ మంచి గుర్తింపు ద‌క్కింది. 

ఇక సిద్ధిక్ కూడా చాలా సినిమాల్లో న‌టించాడు మ‌ల‌యాళంలో. ద‌ర్శ‌కుడిగా సిద్ధిక్ స‌క్సెస్ రేటు ఒక రేంజ్ లో ఉంటుంది. ఇత‌డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాల్లో 90 శాతం విజ‌య‌వంతం కావ‌డ‌మే కాదు, దాదాపు ఆ సినిమాల‌న్నీ మ‌రో భార‌తీయ భాష‌లో అయినా రీమేక్ కావ‌డం, అక్క‌డ కూడా ప్ర‌త్యేకంగా నిల‌వ‌డం జ‌రిగింది.

కెరీర్ ఆరంభంలోనే సిద్ధిక్ తీసిన రామ్ జీ రావ్ స్పీకింగ్.. ఆ త‌ర్వాతి కాలంలో బాలీవుడ్ క్లాసిక్ కామెడీస్ లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాను హిందీలో హేరాఫెరీ పేరుతో రీమేక్ అయ్యి క‌ల్ట్ స్టేట‌స్ ను పొందింది. మ‌ల‌యాళంలో, హిందీ క్లాసిక్స్ లో ఈ సినిమాను ఒక‌టిగా పేర్కొంటారు. ఆ సినిమానే తెలుగులో ధ‌న‌ల‌క్ష్మీ ఐ లవ్యూ పేరుతో రూపొందింది. కామెడీ ప‌రంగా సినిమా అల‌రించినా, సీనియ‌ర్ న‌రేష్ ఈ సినిమాతో త‌న న‌ట‌నాప‌టిమ‌ను చూపించినా.. ఎందుకో ఈ సినిమా తెలుగులో ఆడ‌లేదు. ప్రియ‌ద‌ర్శ‌న్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసి సూప‌ర్ హిట్ కొట్టాడు. అలాగే సిద్ధిక్ తీసిన మ‌రో మ‌ల‌యాళీ కామెడీని హిందీలో ప్రియ‌ద‌ర్శ‌న్ బాగామ్ బాగ్ పేరుతో రీమేక్ చేశాడు.

మ‌లయాళంలో మ‌మ్ముట్టీ హీరోగా వ‌చ్చిన హిట్ల‌ర్ అక్క‌డ సూప‌ర్ హిట్. దాన్ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేసి…సూప‌ర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అల్లుడా మ‌జాకా వంటి బూతు సినిమాతో విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటూ, వ‌ర‌స ప‌రాజ‌యాల మ‌ధ్య‌న ఒక ఏడాది గ్యాప్ త‌ర్వాత హిట్ల‌ర్ రీమేక్ చిరంజీవి స్టామినాను చాటింది.

తెలుగు సినీ ప్రియుల‌కు 90ల‌లో బాగా న‌చ్చిన మ‌ధురాన‌గ‌రిలో, పెద్ద‌రికం వంటి సినిమాల‌కు మూలం సిద్ధిక్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల‌యాళంలో వ‌చ్చిన సినిమాలే. ఇక ర‌చ‌యిత‌గా వేరే ద‌ర్శ‌కుల సినిమాల‌కు సిద్ధిక్ ప‌ని చేశారు. ఇతర ద‌ర్శ‌కుల ర‌చ‌న‌ల‌ను కూడా తెర‌కెక్కించాడు. సిద్దిక్ సినిమాల‌పై హాలీవుడ్ తో పాటు యూరోపియ‌న్ సినిమాల ప్ర‌భావం ఉంటుంది. 

సిద్ధిక్ రూపొందించిన క్రానిక్ బ్యాచిల‌ర్ సినిమాను తెలుగులో ఖుషీఖుషీగా పేరుతో రూపొందించి హిట్ కొట్టారు. మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టీ చేసిన పాత్ర‌ను తెలుగులో జ‌గ‌ప‌తిబాబు చేశారు. మ‌ల‌యాళంలో ఫ్రెండ్స్ పేరుతో సిద్ధిక్ ఖాతాలో మ‌రో సూప‌ర్ హిట్ ఉంది. ఆ సినిమా ను త‌మిళంలో విజ‌య్, సూర్య‌లు రీమేక్ చేసి హిట్ కొట్టారు. దాన్నే స్నేహ‌మంటే ఇదేరా పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. అయితే తెలుగులో ఆ సినిమా అంత‌గా ఆడ‌లేదు. అయితే కామెడీ బిట్స్ మాత్రం బాగా పాపుల‌ర్.

ఇక సిద్దిక్ ఖాతాలో ఆఖ‌రి మంచి హిట్ బాడీగార్డ్. ఈ సినిమాను ఆ త‌ర్వాత చాలా భాష‌ల్లో రీమేక్ చేశారు. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోలు ఈ సినిమాను రీమేక్ చేశారు. హిందీలో డ‌బ్బులు వ‌చ్చాయి కానీ, తెలుగులో ఆ సినిమా ఫ్లాప్.

మ‌ల‌యాళం వ‌ర‌కూ చూసుకుంటే సిద్ధిక్ ఖాతాలో 90 శాతం హిట్స్ ఉంటాయి. ఈ ద‌ర్శ‌కుడు ఒకే ఒక్క తెలుగు సినిమాను రూపొందించాడు. అది నితిన్ హీరోగా. ఆ సినిమా పేరు *మారో*. ఇది విడుద‌ల‌లో చాలా జాప్యాన్ని ఎదుర్కొంది. ముందుగా దీనికి పెట్టిన టైటిల్ స‌త్యం శివం సుంద‌రం. ఆ త‌ర్వాత టైటిల్ మార్చారు. షూటింగ్ పూర్తి చేసుకున్న రెండేళ్ల త‌ర్వాత ఇది విడుద‌ల అయ్యింది. అయితే ప్రేక్ష‌కులు ఈ సినిమాను ప‌ట్టించుకోలేదు.

మ‌ల‌యాళీ స్టార్ డైరెక్ట‌ర్ గా సిద్దిక్ అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు చిర‌కాలం గుర్తుండిపోయే సినిమాల‌ను అందించాడు. తెలుగు సినిమాల‌కు సంబంధించి కూడా ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌కు టైటిల్ కార్డ్స్ లో క‌థ‌- సిద్దిక్ అనే సిగ్నేచ‌ర్ ప్ర‌త్యేకంగా నిలిచిపోతుంది.