కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్‌లతో దేశమంతా వణికిపోయింది. సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గిందే తప్ప, దాని ప్రభావం ఇంకా ఉంది. ప్రతిరోజూ కేసులు వస్తూనే ఉన్నాయి. సెకెండ్ వేవ్ నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మరోవైపు థర్డ్ వేవ్ వార్నింగ్‌లు జనాన్ని భయపెడుతున్నాయి.
కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్‌ల చేదు అనుభవాలతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. థర్డ్ వేవ్ వస్తే… దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంది.
ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్‌కు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ కీలక హెచ్చరిక చేసింది.
మరో రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర టాస్క్‌ఫోర్స్ హెచ్చరించడం గమ నార్హం. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో టాస్క్‌ఫోర్స్ తమ అంచనాలు వెల్లడించింది. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ తో థర్డ్ వేవ్ తలెత్తుతుందని, కేసుల సంఖ్య ఇప్పటితో పోలిస్తే రెట్టింపవుతాయని సీఎంకు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా తమ అంచనాలకు సంబంధించి ఆధారాలను సీఎం దృష్టికి టాస్క్‌ఫోర్స్ అధికారులు తీసుకెళ్లడం గమనార్హం. బ్రిటన్ లో సెకండ్ వేవ్ అనంతరం నాలుగు వారాల్లోపే థర్డ్ వేవ్ వ్యాప్తి చెందిందని అధికారులు వివరించారు.
కొవిడ్-19 నిబంధనలు పాటించకపోవడంతో పాటు మహమ్మారి ఎదుర్కొనేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం మరో విపత్తుబారిన పడాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. అయితే థర్డ్ వేవ్‌లో చిన్నారులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అధికారులు చెప్పడం ఊరటనిచ్చే విషయంగా చెప్పుకోవచ్చు.