చైనాలోని హుబే ప్రావీన్స్ రాజధాని వుహాన్ లో జనజీవనం సాధారణ స్థితికి చేరినట్టుగా సమాచారం. అక్కడ లాక్ డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తేశారట. ఇప్పుడు జనజీవనం మళ్లీ యథాతథ స్థితికి వచ్చిందని, రైళ్లు, బస్సులు కదులుతున్నాయని.. మిగతా ప్రాంతాలకు కూడా వుహాన్ నుంచి రాకపోకలు ప్రారంభం అయ్యాయని వార్తలు వస్తున్నాయి.
చైనాలో కరోనా కరాళ నృత్యం చేసింది హుబే ప్రావీన్స్ లోనే. చైనాలో నమోదైన మొత్తం కరోనా కేసులు 80 వేల కు పైగా కాగా, కేవలం హుబే ప్రావీన్స్ లోనే 50 వేలకు పైగా కేసులు నమోదు అయినట్టుగా చైనా ప్రకటించింది. అలాంటి చోట.. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయట. అయితే దీనికి గానూ అక్కట పటిష్టమైన లాక్ డౌన్ ను అమలు చేశారు.
ఎంతకాలంగా అంటే.. మొత్తం 11 వారాలుగా అక్కడ లాక్ డౌన్ అమల్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే దాదాపు మూడు నెలలుగా అక్కడ అత్యంత పటిష్టమైన లాక్ డౌన్ ను అమలు చేశారు. ప్రజలను ఇళ్లకు పరిమితం చేశారు, మిగతా దేశంతో ఆ ప్రాంతానికి సంబంధాలు తెంచేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందట.
ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏమిటంటే.. కరోనా కరాళ నృత్యం చేసినా వుహాన్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి 11 వారాలు పట్టాయి. అన్ని వారాల పాటు పటిష్టమైన లాక్ డౌన్ ను అమలు చేస్తే కానీ పరిస్థితి సద్దుమణగలేదు. దీన్ని బట్టి ఇండియాలో కూడా లాక్ డౌన్ విషయంలో ఒక అంచనాకు రావొచ్చు. మన దేశంలో మూడు వారాల లాక్ డౌన్ ను ప్రకటించారు. మరో వారం మిగిలి ఉంది. అయితే మన దేశంలో వుహాన్ స్థాయిలో కేసులు రిజిస్టర్ కాలేదు. కాబట్టి.. 11 వారాలు కాకపోయినా కనీసం ఐదారు వారాల పాటు అయినా పటిష్టమైన లాక్ డౌన్ ను అమలు చేస్తే పరిస్థితి పూర్తి నియంత్రణకు రావచ్చునేమో!