“కరోనా కట్టడికి ఒక్కటే మార్గం, సామాజిక దూరం పాటించండి, లాక్ డౌన్ స్ఫూర్తిని చాటండి” అంటూ ప్రతి ఒక్కరూ చెప్పేవారే కానీ పాటించేవారే కరువయ్యారు. కనీసం సాయం చేయడానికి ప్రజల్లోకి వెళ్లే నాయకులు, సామాజిక కార్యకర్తలు కూడా ఈ నియమాన్ని పాటించడం లేదు. ప్రజల ముందు నిలబడి.. మీరంతా సామాజిక దూరం పాటించండి అని చెప్పేంతవరకే వీరి మాటలు.. వారికి మాస్కులు, ఇతరత్రా నిత్యావసరాలు పంచేటప్పుడు మాత్రం మళ్లీ మామూలే.
అప్పటివరకూ ఇళ్లు దాటి బయటకు రాని గ్రామస్తులు, స్థానికులు.. కూరగాయలు పంచుతున్నారనగానే అక్కడ గుమికూడిపోతున్నారు. అది వారి అవసరం కాదనలేం, కానీ వారిలో కాస్తో కూస్తో చైతన్యం తేవాల్సినవారు కూడా పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తే ఎలా..? రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న తంతు ఇదే.
సామాజిక సేవా సంస్థలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు.. అధికారుల దగ్గర అనుమతి తీసుకుని పేదవారి సాయం కోసం కదులుతున్నారు. ప్రత్యేక వాహనాల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లి మరీ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వీరి స్ఫూర్తిని మెచ్చుకోవాల్సిందే, అదే సమయంలో ప్రజల్ని ఒకేచోట గుమికూడకుండా చూడాల్సిన బాధ్యత కూడా వీరిదే. 30 మందికి ఉచితంగా ఆహారం పంచిపెట్టి.. వారిలో ఇద్దరుముగ్గురికి కొత్తగా వైరస్ అంటుకునేటట్టు చేస్తే ఏం లాభం.
ఇప్పటికే ఏపీలో సామాజిక వ్యాప్తి మొదలైందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక దూరం అనే నియమాన్ని మరింత కఠినంగా పాటించాల్సిన పరిస్థితి. లాక్ డౌన్ ఎత్తివేత అసాధ్యం అంటున్న అధికారులు.. ఒకరికొకరు వ్యక్తిగతంగా దూరంగా ఉండండి, సమూహాలుగా తిరగొద్దు అని చెబుతున్నారు.
మరి ఈ నియమాలను సాయం చేసేవారు కూడా కాస్త గుర్తుంచుకుంటే మంచిది. లేకపోతే.. పేదలకు చేసే సాయం వారికి మేలు చేయకపోగా.. వైరస్ వ్యాప్తికి దోహదపడుతుంది. అప్పుడు మరింత కష్టాల్లో పడిపోతాం. తస్మాత్ జాగ్రత్త.