టీకాపై జ‌నానికి త‌ప్పిన త‌ల‌నొప్పి

కోవిడ్ టీకా వ్యాక్సిన్ వేయించుకోడానికి ఇంత కాలం ఉన్న బెడ‌ద త‌ప్పింది. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను గుర్తించిన కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఎప్ప‌టిక‌ప్పుడు ఇబ్బందుల‌ను తొల‌గిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక‌పై రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేకుండా…

కోవిడ్ టీకా వ్యాక్సిన్ వేయించుకోడానికి ఇంత కాలం ఉన్న బెడ‌ద త‌ప్పింది. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను గుర్తించిన కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఎప్ప‌టిక‌ప్పుడు ఇబ్బందుల‌ను తొల‌గిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక‌పై రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేకుండా టీకా వేసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మార్గాన్ని సుల‌భ‌త‌రం చేసింది. అంతేకాదు, టీకా వేయించుకునేందుకు ఎలాంటి అపాయింట్‌మెంట్ లేద‌ని తేల్చి చెప్పింది.

కేంద్ర ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో టీకా వేయించుకోవాల‌నే వారికి ఎంతో మేలు చేసిన‌ట్టైంది. టీకా వేయించుకోవ‌డం కంటే… దాని కోసం రిజిస్ట్రేష‌న్‌, అపాయింట్‌మెంట్ లాంటి త‌తంగంపై జ‌నం అస‌హ‌నంగా ఉంటూ వ‌చ్చారు. ఈ త‌ల‌నొప్పి అంతా త‌మ‌కెందుక‌నే భావ‌న‌తో అస‌లు టీకానే వేయించుకోవ‌ద్ద‌ని నిర్ణ‌యించుకున్న వాళ్లే ఎక్కువ‌. 

ప్ర‌జ‌ల్లోని ఈ అస‌హ‌నాన్ని, అసంతృప్తిని గుర్తించిన కేంద్ర ప్ర‌భుత్వం, వారు కోరుకున్న విధంగానే వ్యాక్సినేష‌న్‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో  18 ఏళ్లు దాటిన వారు నేరుగా సమీపంలోని వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మార్గ‌దర్శ‌కాలు విడుద‌ల చేసింది. 

వ్యాక్సినేటర్లు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌ చేసి, టీకా వేస్తారని తెలిపింది. ఇకపై ‘వాకిన్‌’ విధానంలో టీకా వేయించుకోవచ్చని, కామన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా కొవిన్‌ పోర్టల్‌లో సులభంగా రిజిస్ట్రేషన్‌ చేసు కోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది.

గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పట్టణాల్లోని మురికివాడల ప్రజలను ఆరోగ్య, ఆశా కార్యకర్తలు సమీపంలోని టీకా కేంద్రాలకు తీసుకెళ్లి అక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌ చేసి టీకాలు ఇప్పిస్తారని కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. 1075 హెల్ప్‌లైన్‌ నంబరు ద్వారా కూడా రిజిస్ట్రేషన్‌ చేస్తారని పేర్కొంది. ఈ పద్ధతులన్నీ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసమని అధికారులు చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

రిజిస్ట్రేష‌న్ లేకుండానే వ్యాక్సిన్ వేస్తార‌నే నూత‌న విధానంపై గ్రామీణులు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని మురికివాడ ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న క‌ల్పించాల్సి వుంది.