తెలంగాణ సంస్కృతి, యాస, భాషను తప్పు పట్టి, ఆ తర్వాత క్షమాపణ చెప్పిన హైపర్ ఆదికి చిక్కులు తొలగేలా కనిపించడం లేదు. జబర్దస్త్ కమెడియన్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా హైపర్ ఆది పాపులారిటీ సంపాదించుకున్నాడు. ద్వంద్వార్థాలు, అశ్లీలం కలగలిపి చెప్పే డైలాగ్‌లే కామెడీగా చెలామణి అవుతున్న పరిస్థితి. మరోవైపు జబర్దస్త్ కామెడీ షోపై మహిళా సంఘాల నుంచి విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గని వైనం.
ఈ నేపథ్యంలో ఈ దఫా తెలంగాణ సంస్కృతిపై హైపర్ ఆది దాడి చేయడం వివాదాస్పదమవుతోంది. దీంతో హైపర్ ఆది క్షమాపణలు చెబుతూ గత రాత్రి వీడియో విడుదల చేశాడు. ఆ షోలో చేసిన స్కిట్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయని, అవి తాము కావాలని చేసినవి కావని వివరణ ఇచ్చాడు. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానంతోనే తాము వారికి వినోదం పంచుతున్నట్లు చెప్పుకొచ్చాడు. షోలో జరిగిన దానికి అందరి తరఫున క్షమాపణ కోరుతున్నట్లు హైపర్ ఆది ప్రకటించాడు.
అయితే హైపర్ ఆది క్షమాపణలతో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సంతృప్తి చెందడం లేదు. హైపర్ ఆది ఇతరులను బాధపెట్టడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం సరైంది కాదని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ పేర్కొంటోంది. క్షమాపణలు చెప్పినా విడిచి పెట్టే ప్రసక్తే లేదని ఆ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికీ కూడా పశ్చాత్తాప పడకుండా కేవలం తప్పించుకునే ధోరణిలో ఆది మాట్లాడుతున్నాడని ఆ సంస్థ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎక్కడ కూడా తాము తగ్గేది లేదని.. కచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అతని పర్సనల్ పేజీలో వీడియో పెట్టుకొని చేతులు దులుపుకునే ధోరణి సహించేది లేదని హెచ్చరించారు. దీంతో వివాదం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.