యాంటీబాడీ చికిత్సకు ఎదురుదెబ్బ..!

కరోనా రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ కనిపెట్టారు కానీ, కరోనా వచ్చిన తర్వాత తీసుకునే చికిత్స విషయంలో మాత్రం ఇంత వరకు అన్నీ ప్రయోగాలే తప్ప నిర్దేశిత విధానం లేదు. స్టెరాయిడ్ చికిత్స ఒక్కటే ప్రస్తుతానికి…

కరోనా రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ కనిపెట్టారు కానీ, కరోనా వచ్చిన తర్వాత తీసుకునే చికిత్స విషయంలో మాత్రం ఇంత వరకు అన్నీ ప్రయోగాలే తప్ప నిర్దేశిత విధానం లేదు. స్టెరాయిడ్ చికిత్స ఒక్కటే ప్రస్తుతానికి కాస్త సత్ఫలితాలనిచ్చింది.

స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడితే బ్లాక్ ఫంగస్ ముప్పు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో దానిపై కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక ప్లాస్మా థెరపీ, రెమిడిసెవిర్ ఇంజక్షన్ల వాడకం.. ఇలా అన్నిటిపై అపోహలున్నాయి.

తాజాగా యాండీబాడీ కాక్ టెయిల్ చికిత్స కూడా కరోనా వైరస్ పై పెద్ద ప్రభావం చూపించలేదని తేలిపోయింది. ఆస్ట్రాజెనెకా సంస్థ చేపట్టిన ఈ ప్రయోగం కేవలం 33శాతం మాత్రమే ప్రభావాన్ని చూపించింది. అంటే దాదాపుగా ఇది ఫెయిలైనట్టే లెక్క. AZD442 పేరుతో ఈ కాక్ టెయిల్ చికిత్సపై ప్రయోగాలు జరిగాయి.

ప్లాసెబో చికిత్సతో పోల్చి చూస్తే AZD442 యాండీబాడీ కాక్ టెయిల్ చికిత్స ద్వారా కొవిడ్ రోగుల్లో ఆయా లక్షణాలు అభివృద్ది కాకుండా అడ్డుకోవడం కేవలం 33 శాతమే సాధ్యమైందని తెలిపారు ఆస్ట్రాజెనెకా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మేన్ పంగలోస్. ప్రైమరీ ఎండ్ పాయింట్ అందుకోవడంలో ఈ మందు విఫలమైందని చెప్పారు. 

కరోనా సోకిన వ్యక్తుల్లో వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు, శరీరంలోని యాంటీబాడీలను ప్రేరేపించి వైరస్ పై పోరాడేలా చేసేందుకు ఈ మందుని వినియోగంలోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా దీనికి అనుమతివ్వడం గమనార్హం.

అమెరికా ఆల్రెడీ 5లక్షల డోసులకి ఆర్డర్ ఇచ్చింది కూడా. ఈమేరకు ఆస్ట్రాజెనెకా, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. అయితే యాంటీబాడీ కాక్ టెయిల్ చికిత్స అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడంతో ఆస్ట్రాజెనెకాకు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. అయితే దీన్ని ఇక్కడితో వదిలిపెట్టేది లేదని, AZD442 ని మరింతగా మెరుగుపరచి మంచి ఫలితాలు సాధిస్తామని చెబుతున్నారు ఆస్ట్రాజెనెకా శాస్త్రవేత్తలు.