కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలట! ఈ డిమాండ్‌ను దేశభక్తి పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కావడం గమనార్హం. దేశంలో మత విద్వేషాలను సృష్టించడం తమ జన్మహక్కుగా భావించే పార్టీ ఏంటో అందరికీ తెలుసు. అలాంటి పార్టీకి చెందిన నేతలు కూడా హితవులు, నీతులు చెప్పడం విశేషం.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం తీవ్ర వివాదానికి దారి తీసిన నేపథ్యంలో బీజేపీ నేతలు మీడియా ముందుకొచ్చారు. జాతీయస్థాయి నేత సత్యకుమార్‌తో కలిసి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే అంబేద్కర్ పేరును నవరత్నాల పథకాలకు పెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు. అన్నిటికీ మీ నాన్న, నీ పేరే పెట్టుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు.
కోనసీమలో విధ్వంసానికి ఎవరు బాధ్యులైనా చర్యలు తీసుకోవాలని కోరారు. హింసను భారతీయ జనతా పార్టీ సహించదన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల వైఫల్యమని ఆయన ఆరోపించారు. కోనసీమ విధ్వంసంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొనలేదన్నారు. ఈ వివాదంలోకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును లాగడం బాధాకరమన్నారు. ప్రజలతో ముందే చర్చించి పేరు పెట్టి వుంటే ఈజీ అయ్యేదన్నారు.
అనవసరంగా డాక్టర్ అంబేద్కర్ పేరును వివాదాస్పదం చేసినందుకు దేశ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేయడం గమనార్హం. ఇంత వరకూ ఏ విషయంలోనూ అంబేద్కర్ వివాదం కాలేదన్నారు. మొదటి సారిగా ఆయన పేరు మీద వివాదాన్ని ప్రభుత్వం సృష్టించిందని తప్పు పట్టారు.
ముందస్తు సంప్రదింపులు జరపకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం సహేతుకం కాదన్నారు. ఒక పద్ధతిలో వెళ్లి వుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పు ఒప్పుకుని, విధ్వంసానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని ఆయన కోరారు.