వాళ్ళు జై శ్రీరామ్ …వీళ్ళు జై హనుమాన్

కన్నుకు కన్నుకు …పన్నుకు పన్ను.. ముల్లును ముల్లుతోనే తీయాలి …ఇలాంటి వాటిని నుడికారాలనండి, సామెతలనండి మనకు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ ప్రతీకార సంబంధమైనవన్నమాట. ఎదుటివాడు మనల్ని ఏ ఆయుధంతో దెబ్బ కొడితే మనమూ…

కన్నుకు కన్నుకు …పన్నుకు పన్ను.. ముల్లును ముల్లుతోనే తీయాలి …ఇలాంటి వాటిని నుడికారాలనండి, సామెతలనండి మనకు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ ప్రతీకార సంబంధమైనవన్నమాట. ఎదుటివాడు మనల్ని ఏ ఆయుధంతో దెబ్బ కొడితే మనమూ అదే ఆయుధంతో వాడిని చావుదెబ్బ తీయాలి. 

ఇదీ ఇప్పటి రాజకీయాల్లో యుద్ధ నీతి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కు పక్కలో బల్లెంలా తయారైన బీజేపీని దెబ్బ కొట్టడమే లక్ష్యం. బీజేపీ కొనసాగిస్తున్న హిందూత్వ రాజకీయాల ధాటికి అన్ని రాష్ట్రాల్లోని అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. 

తమది లౌకిక పార్టీ అని చొక్కాలు చించుకునే పార్టీలు కూడా బీజేపీ ధాటికి హిందూత్వ బాట పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తానే అసలైన హిందువును, పైగా బ్రాహ్మణ మహిళను  అని చెప్పింది. ప్రతీరోజూ చండీ పారాయణం చేయందే బయట అడుగుపెట్టనని అన్నది. ఈమధ్య కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ గంగలో మునిగి స్నానాలు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాను హనుమంతుడి భక్తుడనని ప్రకటించుకున్నాడు. 

ప్రభుత్వ ఖర్చుతో వృద్ధులను అయోధ్య నయాత్రకు పంపుతానన్నాడు. నాకంటే పెద్ద హిందువు ఎవరో చూపించండి అంటున్నాడు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈయన చండీయాగం స్పెషలిస్టు. ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో ద్రావిడ సిద్ధాంతాల మీద పుట్టిపెరిగిన నాస్తిక పార్టీ బీజేపీని ఎదుర్కోవడానికి హిందూత్వ బాట పట్టక తప్పలేదు.

ఇలా దేశంలో మెజారిటీ పార్టీలు ఏదో ఒక రూపంలో హిందూత్వబాటలో నడవడం మొదలుపెట్టాయి. ఇక తెలంగాణాకు వస్తే … బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటుంటే టీఆర్‌ఎస్‌ జై హనుమాన్ అంటోంది. వాళ్ళు రాముడిని రాజకీయాలకు ఉపయోగించుకుంటుంటే వీళ్ళు రామ భక్తుడిని పట్టుకున్నారు. 

రామభక్తుడిని రాజకీయం చేసే పనిని కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత నెత్తిమీద వేసుకున్నట్లు కనబడుతోంది. తెలంగాణలోని అన్ని హనుమాన్ ఆలయాల్లో  ఈరోజు నుంచి  అఖండ హనుమాన్ చాలీసా  పారాయణం ప్రారంభం అయింది.  

జగిత్యాల జిల్లా కొండగట్టు  అంజన్న ఆలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హనుమాన్ ఆలయంలో రామకోటి పుస్తకాలను సమర్పించి.. ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం హనుమాన్ చాలిసా పారాయణం ఉంటుంది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో పాటు పలువురు నేతలు పాల్గొంటున్నారు.  ఇవాళ్టి నుంచి కొండగట్టుతో పాలు తెలంగాణవ్యాప్తంగా ఉన్న 3,200 హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. 

రాష్ట్రవ్యాప్తంగా 80 రోజుల పాటు హనుమాన్ చాలిసా పారాయణం జరుగుతుంది. పెద్ద హనుమాన్  జయంతి (జూన్ 4) న ముగుస్తుంది. అన్ని ఆలయాల్లో సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు హనుమాన్ చాలిసా పారాయణం చేస్తారు. ఇందుకోసం అన్ని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

ఎమ్మెల్సీ కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల కాశీ తీర్థయాత్రలకు వెళ్ళింది. అక్కడ పూజారులు రామకోటి స్తూపం ఎంతో మహిమ గలదని నేపాల్‌తో పాటు మన కాశీ దివ్య క్షేత్రంలో  మాత్రమే రామకోటి స్తూపం ఉందని కవితకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 9న ఆమె కొండగట్టుకు వెళ్లి రామకోటి స్తూపానికి ఉత్తరద్వారంలో భూమి పూజ చేసింది. 

బీజేపీ జైశ్రీరామ్ నినాదంతో దూసుకెళ్తోంది. ఇటీవలే రామ మందిర నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు చేపట్టారు. ఊరూరా జైశ్రీరామ్ నినాదం మార్మోగింది. అంతేకాదు పశ్చిమ బెంగాల్‌లో రామనామాన్ని జపిస్తోంది బీజేపీ. అదే నినాదంతో తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. 

ఇప్పటికే దుబ్బాకతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టింది. ఈ క్రమంలో బీజేపీకి చెక్‌ పెట్టేందుకే టీఆర్ఎస్ జై హనుమాన్ నినాదాన్ని అందుకుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే హనుమాన్ చాలిసా పారాయణ  కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు పట్టుదలగా ఉన్నారు. 

రెండేళ్ల ముందే చంద్రబాబుపై కేసు పెట్టాలి

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు