గంటాను నిలదీసిన తమ్ముళ్ళు

ఆయన మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు. గెలిచి మూడేళ్ళు అయినా తన నియోజకవర్గానికి పెద్దగా పోని నాయకుడు. ఆయనే గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన తాజాగా మినీ మహానాడు ని…

ఆయన మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు. గెలిచి మూడేళ్ళు అయినా తన నియోజకవర్గానికి పెద్దగా పోని నాయకుడు. ఆయనే గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన తాజాగా మినీ మహానాడు ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా సమక్షంలో తమ్ముళ్లు తన గళం విప్పి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

పదవులు కష్టపడే వారికి దక్కడంలేదని, పార్టీ కోసం తాము ఉంటే ఎవరో వచ్చి పార్టీ పదవులను తన్నుకుపోతున్నారు అని వారు గంటాకే నేరుగా ఫిర్యాదు చేశారు. ఇలా అయితే ఎలా సారూ అంటూ నిలదీశారు. ఎక్కడ నుంచో వచ్చిన వారు తమ నియోజకవర్గంలో తమ వార్డులలో పదవుల పేరిట పెత్తనం చేయడమేంటి అని కూడా తమ్ముళ్ళు కాస్తా ఘాటుగానే  ప్రశ్నించారు.

ఎవరెవరికో పదవులు ఇస్తే తాము పార్టీలో ఉండడం ఎందుకు అని కూడా అసహనం వ్యక్తం చేశారు. తాము ఇలాగైతే పనిచేయడమెలా అని గంటా మాస్టార్ ఎదుటే అతి పెద్ద ప్రశ్నను సంధించారు. మొత్తానికి ఎన్నికలు రెండేళ్ళు ఉందనగా గంటా యాక్టివ్ అయ్యారు. 

చాలా కాలానికి ఆయన ఉత్తర నియోజకవర్గంలోని తన పార్టీ ఆఫీసుకు వచ్చి మీటింగ్ పెడితే తమ్ముళ్ళు ఇచ్చిన వైల్డ్ రియాక్షనే ఇపుడు అంతటా చర్చగా ఉంది.

గంటా తన నియోజకవర్గానికి సంబంధించి తన వారిని ఇంచార్జిగా నియమించారు. ఆయన తనదైన శైలిలో పార్టీలో అంతా తన వారిని నియమించుకోవడంతో అసలైన తమ్ముళ్ళు మంటెత్తిపోతున్నారు. వారు గంటా సాక్షిగా తమ బాధను చెప్పుకుని అడిగేశారు. 

అయితే ఈ రకంగా తమ్ముళ్ల నుంచి నిలదీత రావడంతో మాజీ మంత్రి ఒకింత షాక్ తిన్నారని అంటున్నారు. మొత్తానికి గంటా ఎదుటనే తమ్ముళ్ళు తమ ధర్మాగ్రహాన్ని ప్రదర్శించడం మాత్రం పార్టీలో చర్చగానే ఉంది.