రఘురామ నీ నామ మెంతో రుచిరా…

‘‘శ్రీరామ నీ నామ మెంతో రుచిరా.. ఎంతో రుచి.. ఎంతో రుచి.. ఎంతో రుచి రా..’’ అంటూ సాగిపోయే పాట చాలా హాయిగా వినసొంపుగా ఉంటుంది. కానీ.. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నాయకులకు…

‘‘శ్రీరామ నీ నామ మెంతో రుచిరా.. ఎంతో రుచి.. ఎంతో రుచి.. ఎంతో రుచి రా..’’ అంటూ సాగిపోయే పాట చాలా హాయిగా వినసొంపుగా ఉంటుంది. కానీ.. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నాయకులకు మాత్రం.. ‘రఘురామ నీ నామ మెంతో రుచిరా..’ అని పాడాలంటే మహా కోరికగా ఉంటుంది. ఇలాంటి రఘురామ భజనలను శృతిమించి చేయడం ద్వారా.. అనేకానేక  కోరికలు నెరవేరుతాయని, ఇహజన్మ సుఖాలు దక్కుతాయనే విశ్వాసం కూడా వారికి బహుమెండుగా ఉన్నట్టుంది. 

రఘు రామ కృష్ణం రాజు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద జగన్ బొమ్మ పెట్టుకుని ఎంపీగా గెలిచి.. తన జీవితాశయం నెరవేర్చుకుని పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాతి నుంచి వైఎస్ జగన్ పార్టీతో సున్నం పెట్టుకున్నారు. ఎడాపెడా తమ పార్టీ గురించి అవాకులు చెవాకులు పేలుతుంటారు. ఆయన మీద సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నారు. 

సీఐడీ పోలీసులు దొరికితే చాలు.. తన మనుషులతో తీసుకెళ్లి, చితక్కొట్టించి.. కిడ్నాప్ మరియు దాడి కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు.. ఆయన భాగస్వామిగా ఉన్న కంపెనీలు వందల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి.. ప్రజలను, ప్రపంచాన్ని వంచించిన కేసుల్లో కూడా ఆయన నిందితుడు. 

ఇలాంటి రఘు రామ కృష్ణం రాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా వెలివేసింది. కానీ.. ఆయన టెక్నికల్ గా పార్టీకి చెందిన ఎంపీగా ఉండడం వలన.. చెప్పులోని రాయిలాగా, చెవిలోని జోరీగలాగా జగన్ ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నారని.. ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది. వైసీపీ ఛీత్కారానికి గురైన ఈ రఘురాజు.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గొడుగు పట్టుకుని ఎన్నికల్లోకి వస్తాడో అనే అనుమానమూ వారిలో ఉంది.  

తాజా పరిణామాలను గమనిస్తే.. ఏపీలో ఎంపీ రఘు రామ కృష్ణం రాజును భజన చేయడానికి అటు జనసేనాని పవన్ కల్యాణ్, ఇటు తెలుగుదేశాధినేత చంద్రబాబునాయుడు భలే పోటీపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఓ సమావేశంలో పవన్ కల్యాణ్.. రఘురాజు గురించి చాలా చాలా సానుభూతి వెలిబుచ్చారు. ఆయనను వేధిస్తున్నారని కన్నీరు కార్చారు. మొత్తానికి వచ్చే ఎన్నికలలోగా.. రఘురాజును తన పార్టీలోకి రాబట్టుకునే ప్రయత్నం ఇదని అంతా అనుకున్నారు. 

తాజాగా చంద్రబాబునాయుడు వంతు వచ్చింది. ఆయన రఘురామ భజన ప్రారంభించారు. ఆయన మీద హత్యాయత్నం జరిగిందని, సొంత నియోజకవర్గంలోని రాలేని పరిస్థితులు కల్పించారని అంటున్నారు. నియోజకవర్గంలోకి రావడానికి కూడా పోలీసు సెక్యూరిటీ కావాలని కోరుకునే వాడు.. అసలు ఎంత లేకి ప్రజానాయకుడో ఎవ్వరైనా అర్థం చేసుకోవచ్చు. 

అయితే ప్రజల్లో ఇప్పుడు మెదలుతున్న సందేహం ఏంటంటే.. చంద్రబాబు, పవన్ ఇద్దరూ.. రఘురామ భజనకు అంతగా పోటీపడుతున్నారు ఎందుకు? ఆయనను తమ పార్టీ తరఫున బరిలోకి దించాలని ఇద్దరూ అత్యుత్సాహపడుతున్నారా? ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే.. ఆర్థిక వనరుల పరంగా కనీసం వంద కోట్ల ఖర్చులను ఆయన చూసుకుంటాడు లెమ్మని ఆశపడుతున్నారా..? అనేది ప్రజల్లో మెదలుతున్న సందేహం. 

ఎటూ బ్యాంకులకు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామ.. అలా వెనకేసిన సొమ్ములు ఘనంగా ఉంటే.. తమ పార్టీకి లాభం దక్కుతుందని.. టీడీపీ, జనసేన కల గంటున్నట్టుగా ఉన్నాయి.