ఏప్రిల్ 14 తర్వాత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుందా? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన అంశం. సామాన్యులు, అసామాన్యులు ఈ అంశం గురించి చర్చించుకుంటున్నారు. ఒకవైపు లాక్ డౌన్ కొనసాగుతున్నా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రతి రోజూ ఆరు వందల స్థాయికి తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. అయితే లాక్ డౌన్ ముందుగా చెప్పిన తేదీ ప్రకారమే.. ఇంకా ఎనిమిది రోజుల వరకూ కొనసాగాల్సి ఉంది.
ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడప్పుడే చెప్పలేని అంశం. మరో నాలుగు రోజుల పాటు దేశంలో కరోనా కేసులు పెరిగే తీరును బట్టి కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అయితే లాక్ డౌన్ ఇంకా వారానికి పైనే కొనసాగాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తిదాయకమైన కామెంట్లు చేశారు.
లాక్ డౌన్ ను కొనసాగించాలని తను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పబోతున్నట్టుగా కేసీఆర్ స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో ఇంకోసారి ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశాలున్నాయి. అప్పుడు తను లాక్ డౌన్ ను కొనసాగించాలని మోడీకి చెప్పబోతున్నట్టుగా కేసీఆర్ స్పష్టం చేశారు. కనీసం రెండు వారాల పాటు లాక్ డౌన్ ను కొనసాగించాలని తను ప్రధానిని కోరబోతున్నట్టుగా ఆయన తేల్చి చెప్పారు.
ఒక చోట లాక్ డౌన్ ఎత్తేసి, మరోచోట కొనసాగించడం .. వంటివి మంచిది కాదన్నట్టుగా కేసీఆర్ స్పందించారు. ఒకవేళ కేంద్రం లాక్ డౌన్ అవసరం లేదని తేల్చినా.. తెలంగాణ వరకూ ఆ తర్వాత రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలున్నాయని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్థికంగా నష్టపోతే మళ్లీ కోలుకోవచ్చు, ప్రాణమే పోతే అప్పుడు ఏం చేయలేమన్నట్టుగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే లాక్ డౌన్ ను పొడిగించడమే అని ఆయన స్పష్టం చేశారు.