భారత్ లో ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగియాల్సి ఉంది. దీన్ని కొనసాగించాలా, లేక అక్కడితో ఆపేయాలా అనే విషయంపై ప్రభుత్వాలు తర్జన భర్జనలు పడుతున్నాయి. ఇప్పటి వరకైతే లాక్ డౌన్ పొడిగించేది లేదని అధికార వర్గాల సమాచారం, ఒకేసారి కాకుండా క్రమక్రమంగా లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తారని సమాచారం.
ఎయిరిండియా మినహా మిగతా విమాన సర్వీసులు ఏప్రిల్ 14 తర్వాత ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్నాయి. రైల్వేశాఖ కూడా ఏప్రిల్ 14 తర్వాత పునరుద్ధరించాల్సిన రూట్లను సిద్ధం చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో బస్ సర్వీసులకు (ఏసీ మినహా) ఏప్రిల్ 14 తర్వాత రిజర్వేషన్ టికెట్లు ఇస్తున్నట్టు సమాచారం. అంటే దాదాపుగా ఏప్రిల్ 14 లాక్ డౌన్ కి ఆఖరు అనుకోవచ్చు.
అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పుడే ఇలా కేసులు పెరుగుతుంటే, ఇక నిబంధనలు ఎత్తివేస్తే కరోనా ఇంకెంత ఉధృతంగా వ్యాపిస్తుందోననే అనుమానాలూ ఉన్నాయి. అంటే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, లేక పెరుగుదల లేకపోవడం అనే స్టేజ్ కి వచ్చే వరకు లాక్ డౌన్ కొనసాగించాలన్నమాట.
అయితే లాక్ డౌన్ ఎక్కువ రోజులు కొనసాగించడం ఆర్థికంగానే కాదు, సామాజికంగానూ దేశానికి పెద్ద ముప్పుగా మారుతుందని అంటున్నారు కొంతమంది. ఇప్పటివరకు మనం కరోనా కేసుల్నే చూశాం. లాక్ డౌన్ ఎత్తివేయకపోతే.. ఆకలి చావుల్ని కూడా చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రవాణా సౌకర్యాలు లేక ఇప్పటికే చాలామంది వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వలసకూలీలు ఇతర ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాజిక కార్యకర్తలు ఆదుకుంటున్నా, ప్రభుత్వాలు సాయం చేస్తున్నా.. వీరికి పూట గడవటం కష్టంగా మారుతోంది.
ఇలాంటి టైమ్ లో ఏప్రిల్ 14పైనే వీరు ఆశలు పెట్టుకున్నారు. నిబంధనలు సడలిస్తే.. రోజువారీ జీవనాన్ని గడపాలని అనుకుంటున్నారు. లాక్ డౌన్ కొనసాగిస్తే వీరంతా తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోతారు. నిబంధనలు ఉల్లంఘించడానికి ఏమాత్రం వెనకాడరు, ఒక రకంగా అప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు కూడా మొదలయ్యే అవకాశాలుంటాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకునే.. అమెరికా లాక్ డౌన్ విషయంలో అంతలా ఆలోచించింది. అయితే ఆ నిర్ణయం వల్ల అగ్ర రాజ్యానికి నష్టమే ఎక్కువగా జరిగింది. ఇక భారత దేశంలో లాక్ డౌన్ ఎత్తివేయకపోతే ఆర్థిక నష్టం కంటే.. ఎక్కువగా సామాజిక నష్టం జరిగే అవకాశం ఉందన్నమాట. ఇలాంటి ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 14 తర్వాత కనీసం నిబంధనలు సడలించాలని కోరుతున్నారు చాలా మంది జనం.
అంటే ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా.. లాక్ డౌన్ ఎత్తివేస్తే జరిగే నష్టం కంటే.. కొనసాగించడం వల్లే కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఊహించని స్థాయిలో జరిగే ఆ నష్టాన్ని తప్పించుకోవాలంటే.. లాక్ డౌన్ నిబంధనలను సడలించి సామాన్య జీవనానికి వెసులుబాటు కలిగించడం ఒక్కటే మార్గం. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.