దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతూ ఉంది. గత కొన్ని వారాలుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నా.. ఇప్పటికీ కోవిడ్ కేసులు వస్తూనే ఉన్నాయి. లక్ష లోపు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉన్నాయి. సెకెండ్ వేవ్ లో కరోనా తీవ్రంగా విజృంభించి సంగతిని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. మార్చి రెండో వారం నుంచినే మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్రంగా వచ్చాయి.
ఏప్రిల్, మే నెలలు పీడకలలుగా గడిచాయి. తొలి వేవ్ వచ్చినప్పుడు లాక్ డౌన్ వల్ల జరిగే నష్టాల గురించి చాలా మంది మాట్లాడేశారు. సెకెండ్ వేవ్ లో అలాంటి అంశాల గురించి మాట్లాడే వాళ్లు కూడా లేకుండా పోయారు. ఇప్పుడు కరోనా సోకకపోతే చాలు, ప్రాణాల మీద వరకూ రాకపోతే చాలు.. అనేదే ఆశావాదంగా మారింది. ఈ స్థాయిలో కరోనా తీవ్రంగా భయపెట్టింది.
ఇక సెకెండ్ వేవ్ లో ఇంతకీ ఎంత మంది కరోనా బారిన పడ్డారనేది చర్చనీయాంశం. ప్రత్యేకించి బిహార్ లో గత వారంలో ఒకే రోజు కరోనా కారణ మరణాలకు సంబంధించి నంబర్ భారీగా పెరగడంతో..అసలు కథ ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారుతోంది. కోవిడ్-19 కారణ మరణాలుగా ప్రభుత్వం పరిగణించని కొంతమంది మృతిని కోర్టు ఆదేశాల మేరకు వారంతా కోవిడ్ తోనే మరణించినట్టుగా ప్రభుత్వం ధ్రువీకరించాల్సి వచ్చిందక్కడ.
ప్రభుత్వాలు కరోనా నంబర్లను ఎక్కడో దాస్తున్నాయనే అభిప్రాయాలు ఇప్పటికే ఉన్నాయి. పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు కూడా ఈ విషయం గురించి కథనాలు ఇచ్చాయి. ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని అంతర్జాతీయ పత్రికలు రాశాయి. అయితే భారత ప్రభుత్వం ఆ ప్రచారాన్ని ఖండించింది.
మరి ఈ విషయాల్లో ప్రభుత్వాలను ఎంత వరకూ నమ్మవచ్చు? ఆసుపత్రులు ఇస్తున్న డేటా కరెక్టేనా? అనే అంశం గురించి పరిశీలిస్తే, కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అదేమిటంటే.. ప్రభుత్వం వద్ద కరోనా టెస్టు చేయించుకున్నా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు చేయించుకున్నా.. అక్కడ ఆధార్ కార్డు నంబర్ అడుగుతున్నారు.
తమ వద్ద ఎవరు కరోనా టెస్టు చేయించుకున్నారో, వారిలో ఎవరికి పాజిటివ్ వచ్చిందో.. ప్రైవేట్ ఆసుపత్రులు క్రమం తప్పకుండా ప్రభుత్వానికి సమాచారాన్ని ఇచ్చే పద్ధతి అమల్లో ఉంది. దీని వల్ల కేసుల నంబర్ల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. కరోనా టెస్టు ఇలా ఆధార్ తో అనుసంధానం కావడం వల్ల.. రోజువారీ కేసుల విషయంలో ప్రభుత్వాలకు స్పష్టత ఉంది. అయితే .. నంబర్ ను అనౌన్స్ చేయడం మాత్రం ప్రభుత్వం చేతిలోని పనే!
ప్రభుత్వ, ప్రైవేట్ వద్ద జరిగిన టెస్టుల్లో పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య అంతిమంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వద్దకు వెళ్లవచ్చు. అంతిమంగా నంబర్ ను ప్రకటించాల్సింది, కేంద్రానికి ఆ వివరాలను పంపించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఫలితంగా.. నంబర్లు ప్రభుత్వం నుంచి వెల్లడి కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే.. ఈ నంబర్ల విషయంలో మరీ ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది కేవలం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే.
తమ వద్ద కేసులే లేవు అంటూ కొన్ని రాష్ట్రాలు బుకాయిస్తున్నాయనేది వాస్తవమని స్పష్టం అవుతోంది. నంబర్లను తప్పుగా చూపుతున్నారని ప్రజలకు ప్రభుత్వంపై విశ్వసనీయతను కోల్పోయినప్పుడు.. వారు చికిత్సకు కూడా ప్రభుత్వంపై ఆధార పడటం తగ్గిపోతుంది. నంబర్లను తక్కువ చేయడం ద్వారా పైకి అంతా బాగున్నట్టుగా ప్రభుత్వాలు కవర్ చేసుకోవచ్చేమో కానీ, దీర్ఘకాలంలో ప్రజల నమ్మకాన్ని కోల్పోవడానికి ఇది కీలక పరిణామం అవుతుంది. ఇది వాస్తవం కూడా.
కొన్ని రాష్ట్రాలు మొహమాటం లేకుండా కేసుల సంఖ్యను అనౌన్స్ చేశాయి. పరిస్థితి బాగోలేదనే స్పష్టతను ఇచ్చాయి. తమకు ఆక్సిజన్ కేటాయింపులను పెంచాలని కూడా ఆ రాష్ట్రాలు కేంద్రాన్ని బహిరంగంగా కోరాయి. సంసారం గుట్టు, రోగం రట్టు అన్నారు.. రోగాన్ని బయటకు చెప్పుకోవడమే మంచిది.
ఇక అనధికారిక కేసులు కూడా అంతటా బోలెడన్ని ఉన్నాయి సెకెండ్ వేవ్ లో. ఇది ప్రజలు స్వయంగా చేసే పని. చాలా మంది కరోనా లక్షణాలున్నా టెస్టులకు వెళ్లలేదు. సొంతంగా ట్రీట్ మెంట్ చేసుకోవడం, ప్రైవేట్ డాక్టర్లు, సోషల్ మీడియాలో చెప్పే మందులను వాడటం, ఇంట్లోనే ఉండటం చేశారు.
ఇలాంటి కేసుల సంఖ్య కూడా దేశంలో లక్షల్లో, అంతకన్నా ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం టెస్టులు చేస్తామన్నా.. వీరంతా వెళ్లని బ్యాచ్. కరోనా అని బయటకు తెలిస్తే పరువు తక్కువ అని భావించే జనాలు కూడా ఇండియాలో కోకొల్లలు. ఇలాంటి వారిలో చాలా మంది హోం ఐసొలేషన్లోనే బయటపడగా, కొందరు పరిస్థితిని మరింత తీవ్రం కూడా చేసుకున్నవారుంటారు.