ఒక మనిషి బతికిన బతుకు విలువ చావులో తెలుస్తుందంటారు. అంటే ఆ మనిషి తుది శ్వాస విడిచినప్పుడు అంతిమ యాత్రకు హాజరయ్యే జనాన్ని బట్టి, ఆ వ్యక్తికి సమాజంతో ఉన్న అనుబంధాన్ని అంచనా వేస్తుంటారు. కానీ కరోనా కారణంగా లాక్‌డౌన్ ఉన్న నేటి పరిస్థితులకు తోడు ఎవరి నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోననే భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది.
ఈ పరిస్థితుల్లో కుటుంబంలో ఎవరైనా చనిపోతే అదో పెద్ద విషాదం. అయితే ఆ విషాదంలో కూడా మరో విషాదం దాగి ఉంది. పట్టుమని పది మంది కూడా శవాన్ని చూసేందుకు రాలేని దుస్థితి. అంతే కాదు, చనిపోయిన తర్వాత పాడె మోసేందుకు నలుగురు మనుషుల్ని మిగిల్చు కోవాలని పెద్దలు చెబుతుంటారు. శనివారం వార్తా పత్రికల్లో కనిపించిన ఓ అంతిమ యాత్ర దృశ్యం…కరోనా రక్కసి ఎంత అమానవీయమో తెలియజేసింది.
కనీసం పాడె పట్టేందుకు కూడా నలుగురు మనుషులు కూడా ముందుకు రాని స్థితిలో వాహనంలో అంతిమ యాత్ర సంస్కారాన్ని కేవలం ఒకే ఒక్క కుటుంబ సభ్యుడు నిర్వహించడం మానవ సమాజాన్ని కరోనా ఎంతగా పీడిస్తోందో ప్రతిబింబించింది. విజయనగరం జిల్లాలోని వీటీ అగ్రహారం నుంచి విజయనగరం పట్టణంలోని బాలాజీ జంక్షన్ మీదుగా మృతదేహాన్ని శ్మశానానికి కుటుంబ సభ్యుడు తీసుకెళుతుండటం మనసులను కలచివేసింది. పగవాడికి కూడా ఇలాంటి చావు వద్దు దేవుడా అని ప్రతి ఒక్కరూ కోరుకునేలా ఉంది.
కరోనా విపత్కర పరిస్థితులు గుంపులుగా చేరడం నిషేధం కావడం, సామాజిక దూరం పాటించాల్సి రావడంతో ఎంతో దగ్గరి వాళ్లు కూడా మనిషి ప్రయాణంలో అంతిమ ఘట్టంలో పాల్గొనలేని దురవస్థను కరోనా కల్పించింది. అందుకే ఈ కరోనాను మన సమాజం నుంచి తరిమి తరిమి కొట్టాలి. మానవీయ సమాజాన్ని మళ్లీ పునరుద్ధించాల్సిన ఆవశ్యకతను ఇలాంటి అంతిమ యాత్రలు గట్టిగా చెబుతున్నాయి.