దిల్ రాజు స్వరం ఎందుకు మారింది?

సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్ ల నుంచి నిర్మాతలకు వున్న సమస్యలను పరిష్కరించుకుని, ఆ తరువాతే నిర్మాణాలు స్టార్ట్ చేస్తే బెటర్ అన్నది ఇటీవల జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశంలో కీలక పరిణామం. …

సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్ ల నుంచి నిర్మాతలకు వున్న సమస్యలను పరిష్కరించుకుని, ఆ తరువాతే నిర్మాణాలు స్టార్ట్ చేస్తే బెటర్ అన్నది ఇటీవల జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశంలో కీలక పరిణామం. 

టాప్ 6 హీరోల విషయం పక్కన పెట్టి మిగిలిన టైర్ 2 హీరోలు, కీలక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యూనిరేషన్లు, అలాగే హీరోల అసిస్టెంట్లు, స్టాఫ్, ఇవన్నీ కూడా గిల్డ్ సమావేశంలో చర్చకు వచ్చాయన్నది కీలక సమాచారం. ఇక సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మె కూడా ఓ పాయింట్. 

ప్రతి క్రాఫ్ట్ నుంచి తమకు ఎదురవుతున్న సమస్యలను లిస్ట్ చేసి, పరిష్కారాలు వెదకాలని, అప్పుడే మళ్లీ నిర్మాణాలు స్టార్ట్ చేస్తే బెటర్ అని, అప్పటి వరకు నిర్మాణాలు అపాలని అనుకుని, దానిపై సలహాలు, సూచనలు కోరింది నిజం. ముందు రోజు సమావేశమైన గిల్డ్ కీలక సభ్యులు మరునాడు సెట్ మీద సినిమాలు వున్న నిర్మాతలు అందరినీ కబురు చేసి దస్ పల్లా హొటల్ లో సమావేశం నిర్వహించింది అందుకోసమే.

కానీ నిన్నటికి నిన్న దిల్ రాజు తన థాంక్యూ సినిమా ప్రెస్ మీట్ లో మాత్రం కొత్తగా మాట్లాడారు. కేవలం కంటెంట్ క్వాలిటీ, ఓటిటి, టికెట్ ప్రైస్ కోసమే సమావేశం అయ్యామని, అంతే తప్ప షూటింగ్ ల బంద్ గురించి కాదని చెప్పే ప్రయత్నం చేసారు. షూటింగ్ ల బంద్ గురించి కాకపోతే, ఈ కార్యక్రమానికి సహకరించాలని కూడా నిర్మాతల మండలిని కోరింది ఎందుకు? ఈ అంశంపై తమకు సహకరించాలని కౌన్సిల్ ను గిల్డ్ కోరిందని కౌన్సిల్ పెద్దలే స్పష్టం చేసారు.

మరి ఎందుకు దిల్ రాజు ఈ విషయం బాహాటంగా అంగీకరించడం లేదు. అసలు బంద్ ఆలోచన లేదు అన్నట్లు ఎందుకు మాట్లాడారు? దాదాపు షూటింగ్ పూర్తయ్యే దశలో వున్న సినిమాల నిర్మాతలు బంద్ కు సుముఖంగా లేరు. 

కానీ అది మాత్రమే కారణం అయి వుండదు..దిల్ రాజు ప్రెస్ మీట్ లో ఆ విషయం ఏమీ లేదు, కంటెంట్..ఓటిటి..టికెట్ రేట్లు మాత్రమే అని చెప్పడానికి. బహుశా హీరోల నుంచి బయటకు తెలియని వ్యతిరేకత వస్తుందనో? లేదా తనపై హీరోలకు వ్యతిరేకత వస్తుందనో అన్నది కూడా కారణం అయి వుండాలని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

లాభం లేకుండా వ్యాపారి వరద జోలికి పోడు అని సామెత. అలాగే దిల్ రాజు ఏం తలపెట్టినా, ఏం చేసినా దాని వెనుక చాలా అంటే చాలా వుంటుందని ఇండస్ట్రీ జనాల నమ్మకం. 

గిల్డ్ లో బంద్ ప్రతిపాదన చేసినా, గిల్డ్ బయట అబ్బే అలాంటిది లేదు అన్నా, అసలు విషయం మరేదో వుండే వుంటుంది…డౌటే లేదు.