వెంక‌య్య బ‌రిలో వుంటే…ఆ ఇద్ద‌రూ గైర్హాజ‌ర‌య్యేవారా?

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసింది. ఇక ఫ‌లితం వెలువ‌డాల్సి వుంది. ఎన్‌డీఏ కూట‌మి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము విజ‌యం లాంఛ‌న‌మే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ద్రౌప‌దికి జై కొట్టిన సంగ‌తి…

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసింది. ఇక ఫ‌లితం వెలువ‌డాల్సి వుంది. ఎన్‌డీఏ కూట‌మి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము విజ‌యం లాంఛ‌న‌మే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ద్రౌప‌దికి జై కొట్టిన సంగ‌తి తెలిసిందే. 

ఇవాళ జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకి చెందిన 151కి 151 మంది ఎమ్మెల్యేలు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. వీరిలో ఒకే ఒక్క ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాత్రం హైద‌రాబాద్‌లో ఓటు వేశారు. మిగిలిన వారంతా ఏపీలోనే త‌మ హ‌క్కు వినియోగించుకున్నారు.

టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు వుంటే, వారిలో ఇద్ద‌రు మిన‌హా మిగిలిన వారంతా ఓటు హ‌క్కు వినియోగించ‌కున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు నంద‌మూరి బాల‌కృష్ణ‌, బుచ్చ‌య్య‌చౌద‌రి విదేశాల్లో వుండ‌డంతో ఓటు హ‌క్కు వినియోగించుకోలేక‌పోయారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. ఒక‌వేళ రాష్ట్ర‌ప‌తి బ‌రిలో వెంక‌య్య‌నాయుడే ఉండి వుంటే ఈ ఇద్ద‌రు చౌద‌రిలు ఓటు వేయ‌కుండా ఉండేవారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

ఒక‌వైపు అణ‌గారిన వ‌ర్గాల‌కు వెన్నుద‌న్నుగా నిల‌బ‌డ‌డానికే గిరిజ‌న మ‌హిళైన ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ఇచ్చామ‌ని ఇటు అధికార‌, అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీలైన వైసీపీ, టీడీపీ గొప్ప‌లు చెప్పాయి. వైసీపీ మాత్రం త‌న స‌భ్యులంతా ఓటింగ్‌లో పాల్గొని ద్రౌప‌దికి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఇదే టీడీపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి లైట్ తీసుకున్న‌ట్టు …. ఇద్ద‌రు ఎమ్మెల్యేల గైర్హాజ‌రే తెలియ‌జేస్తోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే నాయుడు గారు రాష్ట్ర‌ప‌తి బ‌రిలో వుంటే ….ప్ర‌పంచంలో ఏ మూల‌న ఉన్నా బాల‌కృష్ణ‌, బుచ్చ‌య్య‌చౌద‌రి ఓటింగ్‌కు రాకుండా ఉండేవారా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ద్రౌప‌ది గిరిజ‌న మ‌హిళ కావ‌డం వ‌ల్లే క‌దా టీడీపీ సీరియ‌స్‌గా తీసుకోలేద‌నే విమ‌ర్శ లేక‌పోలేదు. 

నిజంగా గిరిజ‌న మ‌హిళ‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇచ్చి వుంటే…. బాల‌కృష్ణ‌, బుచ్చ‌య్య‌చౌద‌రిని త‌ప్ప‌క ఓట్లు వేసేందుకు ర‌ప్పించే వార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఏది ఏమైనా బాల‌య్య‌, బుచ్చ‌య్య ఏ కార‌ణం వ‌ల్ల గైర్హాజ‌రైనా, భిన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయ‌నేది వాస్త‌వం.