ఎన్టీఆర్ ముప్పయ్యవ చిత్రం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఖరారయిన సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్. తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే బెస్ట్ అని భావించి ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌ని ఎప్పుడో సెట్ చేసుకున్నాడు. ‘అల వైకుంఠపురములో’ విడుదల కాకముందే ఖరారయిన ఈ చిత్రం అది పెద్ద హిట్ అయిన తర్వాత మరింత స్ట్రాంగ్‌గా లాక్ అయిపోయింది.
హారిక హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రాన్ని మే నెలలో మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ కరోనా క్రైసిస్ వల్ల సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఈ చిత్రం మొదలు కావడానికి మరికాస్త సమయం పట్టవచ్చు. అయితే ఈలోగా త్రివిక్రమ్ మరో చిత్రం డైరెక్ట్ చేస్తాడంటూ గాసిప్‌లు పుట్టిస్తున్నాయి కొన్ని వెబ్సైట్లు.
ప్రస్తుతం వచ్చిన గ్యాప్‌లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా పూర్తి చేసుకుని, ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ముగించుకునే లోపు లొకేషన్స్‌ని త్రివిక్రమ్ ఫైనలైజ్ చేసుకుంటాడు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో షూట్ మొదలయినా కానీ వచ్చే వేసవికి ఖచ్చితంగా విడుదల చేసేలా పక్కా ప్రణాళిక వేసుకుంటున్నారు. ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్, ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత తారక్ కాంబినేషన్ అనే క్రేజ్‌ని ఎవరైనా చూస్తూ చూస్తూ ఎందుకు చెడగొట్టుకుంటారు?