గోమూత్ర సేవనం.. సర్వ వ్యాధి నివారణం అంటారు కొంతమంది. గోమూత్రాన్ని తాగితే.. శరీరంలో ఎలాంటి కల్మషాలున్నా పోతాయని, అంతటి శక్తి గోవుకి ఉందని చెబుతుంటారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక… గోమూత్రానికి కూడా మంచి డిమాండ్ వచ్చింది. అయితే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో గోమూత్రానికి మరింత డిమాండ్ పెరిగింది. ఒక్క గుజరాత్ రాష్ట్రం నుంచే రోజుకి 6వేల లీటర్ల గోమూత్రాన్ని ఎగుమతి చేస్తున్నారు.
కేంద్ర మాజీ మంత్రి, గుజరాత్ రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభ కత్రియా చెబుతున్న లెక్కలు వింటే కళ్లుబైర్లు కమ్మక మానవు. కరోనా వైరస్ ని ఎదుర్కునే శక్తి గోమూత్రానికి ఉందనే ప్రచారం మొదలైన తర్వాత గుజరాత్ లో గోమూత్రానికి డిమాండ్ పెరిగిపోయింది. గోమూత్రానికి తులసి, అల్లం.. కొన్ని వనమూలికలు కలిపి “గోమూత్ర ఆర్క్” అనే పానీయాన్ని తయారు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. లీటర్ 360 రూపాయల నుంచి మొదలై.. డిస్టిల్డ్ గోమూత్ర ఆర్క్ అనే పేరుతో 8వేల రూపాయల వరకు కూడా దీన్ని అమ్ముతున్నారు. ఆన్ లైన్ లో కూడా ఆర్డర్ ఇచ్చే వెసులుబాటు ఉంది.
కరోనా భయంతో ఇప్పుడు చాలామంది గోమూత్ర ఆర్క్ తాగడం మొదలు పెట్టారు. గతంలో ఒక్కో షాపులో 30 నుంచి 50 బాటిళ్లు అమ్ముతుండగా.. ఇప్పుడు రోజుకి 500 బాటిళ్లకు డిమాండ్ పెరిగింది. కేవలం తాగడానికే కాదు, హ్యాండ్ శానిటైజర్ తయారీలో కూడా గోమూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. గోమూత్ర బాడీ స్ప్రేకి గుజరాత్ లో మంచి డిమాండ్ ఉంది అంటే ఆశ్చర్యం కలగక మానదు. బ్యాక్టీరియా, వైరస్ లను చంపే ఈ బాడీస్ప్రేకి కూడా ఇప్పుడు విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది.
ఇటీవల ఢిల్లీలో గోమూత్ర పార్టీ కూడా ఒకటి జరిగిందట. మందు పార్టీలాగా గోమూత్రాన్ని తాగే పార్టీ అన్నమాట. మొత్తమ్మీద.. కరోనా ప్రభావంతో గుజరాత్ లోని గోశాలల దశ ఒక్కసారిగా మారిపోయింది. గుజరాత్ లో మొత్తం 4వేల గోశాలలున్నాయి. వీటిలో 500 గోశాలల్లో ఆవు మూత్రం అమ్మకానికి పెడుతున్నారు. నేరుగా విక్రయించడం కంటే.. గోమూత్ర ఆర్క్ తయారు చేసే కంపెనీలకు సరఫరా చేయడమే ఇక్కడ ఎక్కువ.
ఆ మధ్య పతంజలి కూడా తమ గోమూత్రంతో తయారు చేసిన ప్రోడక్ట్స్ ని తమ స్టోర్స్ లో విక్రయానికి ఉంచింది. కరోనా కాలంలో ఇలాంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. శాస్త్రీయంగా ఇది రుజువు కాకపోయినా.. జనాల వేలంవెర్రి మాత్రం ఆగలేదు.