కరోనా ధాటికి అమెరికా అతలాకుతలం అవుతోంది. రోజురోజుకు పాటిజివ్ కేసుల సంఖ్య పెరగడంతో పాటు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే యూఎస్ లో 884 మంది మరణించడం అత్యంత బాధాకరం. ప్రస్తుతం కరోనాను కట్టడి చేయడంలో అగ్రరాజ్యం చేతులెత్తేసింది. దాదాపు 2 లక్షల 40వేల మంది చనిపోయే ప్రమాదముందని స్వయంగా వైట్ హౌజ్ ప్రకటించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం అమెరికాను వణికిస్తోంది. ఇప్పటివరకు అగ్రరాజ్యంలో 2,15,215 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య రోజుకు సగటున 1100 చొప్పున పెరుగుతున్నాయి. తాజా మరణాలతో కలిపి అమెరికాలో ఇప్పటివరకు 5110 మంది మరణించారు. 8878 మంది కోలుకున్నారు.
అటు ఇటలీ, స్పెయిన్ దేశాల్ని కూడా కరోనా చావుదెబ్బ కొట్టింది. ఇటలీలో నిన్నటికి కరోనా మృతుల సంఖ్య 13,155 (వరల్డ్ లోనే హయ్యస్ట్)కు చేరుకుంది. దేశంలో 1,10,574 మందికి కరోనా సోకగా.. వీళ్లలో 10వేల మంది పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అటు స్పెయిన్ లో 9387 మంది మృత్యువాత పడ్డారు. లక్షా 4 వేల మందికి చికిత్స కొనసాగుతోంది.
కరోనా పుట్టిన చైనాలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. నిన్న ఎలాంటి మరణాలు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం దేశంలో ఉన్న 81వేల మంది కరోనా బాధితుల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చైనా అధికారులు ప్రకటించారు. చైనాలో మొత్తం మృతుల సంఖ్య 3312గా ఉంది.
ప్రపంచంలోని ప్రతి దేశానికి కరోనా పాకినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. దేశంలోని 60శాతం భూభాగానికి ఈ వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచఆరోగ్య సంస్థ వేసిన అంచనా తప్పింది. ఈస్ట్ గనియా, తిమోర్, జింబాబ్వే లాంటి చిన్నచిన్న దేశాల్లో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ 9,35,957 మందికి సోకింది. వీళ్లలో 47,245 మంది చనిపోగా.. 1,94,286 మంది కోలుకున్నారు. 35,610 మంది పరిస్థితి విషమంగా ఉంది.