నిమ్మ‌గ‌డ్డ క‌త్తికి రెండు వైపులా ప‌దునే!

ఔనంటే కాద‌నిలే…కాదంటే ఔన‌నిలే, ఆడువారి మాట‌ల‌కు అర్థాలే వేరులే అనే పాట‌ను ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ్య‌వ‌హార‌శైలి గుర్తు చేస్తోంది. క‌రోనా ప్ర‌భావం ఇంకా ఉంద‌ని, కావున ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో వ‌ద్ద‌ని ఎంత మొర…

ఔనంటే కాద‌నిలే…కాదంటే ఔన‌నిలే, ఆడువారి మాట‌ల‌కు అర్థాలే వేరులే అనే పాట‌ను ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ్య‌వ‌హార‌శైలి గుర్తు చేస్తోంది. క‌రోనా ప్ర‌భావం ఇంకా ఉంద‌ని, కావున ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో వ‌ద్ద‌ని ఎంత మొర పెట్టుకున్నా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వినిపించుకోలేదు.

రాజ్యాంగంలోని 243కె అధికర‌ణ కింద ఎన్నిక‌ల సంఘానికి స్వ‌యంప్ర‌తిప‌త్తి ఉంద‌ని, ఐదేళ్ల‌కు ఒక‌సారి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం క‌మిష‌న్ విధి అని ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ పెద్ద‌పెద్ద ఉప‌న్యాసాలే ఇచ్చారు. చివ‌రికి న్యాయ‌స్థానాల ఆదేశాల మేర‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లైంది. నిమ్మ‌గ‌డ్డ ప‌ద‌వీ కాలం ఈ నెలాఖ‌రుతో ముగియ‌నున్న నేప‌థ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయ‌తీ, పుర‌పాల‌క ఎన్నిక‌లన్నీ పూర్తి చేసి పోతార‌ని అంద‌రూ భావించారు.

ఈ నేప‌థ్యంలో అప్ప‌ట్లో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పుర‌పాల‌క ఎన్నిక‌ల‌కు బ‌దులు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత మున్సిపాలిటీ ఎన్నిక‌ల‌ను పూర్తి చేశారు. ఈ క్ర‌మంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌పై మ‌డ‌త పేచీ పెట్టారు. గ‌తంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు భారీగా ఏక‌గ్రీవం కావ‌డం, వాటిని ఎలాగైనా అడ్డుకోవాల‌నే త‌లంపుతో నిమ్మ‌గ‌డ్డ కొత్త మెలిక పెట్టారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి ఎవరైనా బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాల కారణంగా నామినేషన్ వేయలేకపోయారో వారు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు జరిపి.. అది నిజమని తేలితే వాళ్లను మళ్లీ అభ్యర్థిగా పరిగణిస్తామని ఎన్నికల కమిషన్  ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల‌పై అధికార పార్టీ భ‌గ్గుమంది.

ఏక‌గ్రీవ‌మైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స‌భ్యులు కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై హైకోర్టు స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి నేడు తుది తీర్పు నిచ్చింది. నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌కు మ‌రోసారి షాక్ ఇచ్చిన ఆ తీర్పులో ఏమున్న‌దంటే… ఏక‌గ్రీవాల‌పై ద‌ర్యాప్తు జ‌రిపేందుకు వీల్లేదంది. అలాగే గ‌తంలో ఏక‌గ్రీవ‌మైన వారికి వెంట‌నే డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని ఆదేశించింది.  అలాగే ఎక్కడైతే ఎన్నికలు నిలిచిపోయాయో.. అక్కడ మళ్లీ ఎన్నికలు జరుపుకోవచ్చునని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్ర‌తిదీ గౌర‌వ న్యాయ‌స్థానం ఆదేశాల మేర‌కు చేస్తున్నామ‌ని చిలుక ప‌లుకులు ప‌లికే నిమ్మ‌గ‌డ్డ …ఇప్పుడు మాత్రం కోర్టు ఆదేశాల‌ను ఎందుకు గౌర‌వించ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌లు జ‌ర‌పండి మ‌హాప్ర‌భో అని ప్ర‌భుత్వం వేడుకుంటున్నా …నిమ్మ‌గ‌డ్డ మాత్రం ఆస‌క్తి చూప‌కపోవ‌డం గ‌మ‌నార్హం. 

గ‌తంలో ప్ర‌భుత్వం వ‌ద్దంటే ..రాజ్యాంగం, ఎన్నిక‌ల సంఘం స్వ‌యంప్ర‌తిప‌త్తి, గాంధీజీ క‌ల‌లు క‌న్న గ్రామ స్వ‌రాజ్యం అని దేశ భ‌క్తి ఉప‌న్యాసాలు ఇచ్చిన నిమ్మ‌గ‌డ్డ‌కు … ఇప్పుడు అవేవీ ఎందుకు గుర్తుకు రావ‌డం లేద‌ని ప్ర‌తి ఒక్క‌రూ అడుగుతున్న ప్ర‌శ్న. పంచాయ‌తీ, పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చావు దెబ్బ‌తిన్న నేప‌థ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌రోధాలు ఏర్ప‌డ్డాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఎంతైనా నిమ్మ‌గ‌డ్డ సార్ అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు రాజ్యాంగాన్ని ఉప‌యోగించుకున్నార‌ని చెబుతున్నారు. అప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి రాజ్యాంగ అస్త్రాన్ని ప్ర‌యోగించార‌ని, ఇప్పుడు నిర్వ‌హించ‌క‌పోవ‌డానికి కూడా బ‌హుశా దాన్నే సంధిస్తారేమోన‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా నిమ్మ‌గ‌డ్డ క‌త్తికి రెండు వైపులా ప‌దునే అని చెప్ప‌క త‌ప్ప‌దు.  

పొలిటికల్ హీరో జగన్ 

అమ‌రావ‌తి రైతులను మరోసారి మోసం చేసిన చంద్రబాబు