జేసీ దివాకరరెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఈయన కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే. ఏపీలో మునిసిపల్ ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. ఎవరేంటి అన్నది కూడా జనాలు తీర్పు ఇచ్చేశారు.
ఇపుడు తాపీగా జేసీ దివాకరరెడ్డి ఏడేళ్ళ క్రితం నాటి పాత ముచ్చట్లను చెబుతున్నారు. అవి ఇంతకు ముందు ఎపుడూ కనీసమాత్రంగా కూడా ప్రస్తావించనివి కావడమే ఇక్కడ విశేషం.
ఇంతకీ జేసీ చెప్పిన ఆ ముచ్చట ఏంటి అంటే తాను కూడా ఒకప్పుడు విశాఖను రాజధానిగా చేయమని చంద్రబాబుని కోరానని అంటున్నారు.
అయితే దోనకొండను రాజధానిగా చేయండి, లేకపోతే విశాఖపట్నాన్ని చేయండి అని బాబుకు ఆనాడే అంటే 2014లో బాబు సర్కార్ ఏర్పడిన కొత్తల్లో చెప్పాను అని జేసీ ఇపుడు చెబుతున్నారు. సరే చంద్రబాబు అమరావతినే రాజధానిగా చేశారు, అందువల్ల ఇపుడు దానికే అంతా కట్టుబడి ఉండాలని, అది మార్చలేమని జేసీ అంటున్నారు.
అంటే నాడు రాయలసీమకు చెందిన జేసీ చెప్పారు, ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్ లాంటి వారు కూడా చెప్పారు. మరి ఇంతమంది చెప్పినా బాబు విశాఖ వైపు కన్నెత్తి చూడలేదు అంటే అసలు తప్పు ఎవరో చేశారో విశాఖ వాసులు ఇప్పటికైనా అర్ధం చేసుకుంటారేమో కదా.