తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలలు కంటున్నాయి. అధికారం మాదే అని రెండు పార్టీలు ఢంకా బజాయించి చెబుతున్నాయి.
సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బయటకు కనిపించే దృశ్యం ఏమిటంటే …. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. నాయకుల్లో ఒకరితో మరొకరికి పడదు. సింపుల్ గా చెప్పాలంటే పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువ. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు. మొత్తం మీద చెప్పాలంటే పార్టీలో ఐకమత్యం లేదు. కానీ ఇన్ని ఉన్నా రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెసేనని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన సర్వేలో వెల్లడైందట. వాస్తవానికి ఇప్పటికిప్పుడు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగానా బీజేపీ రాష్ట్రంలో పది నుంచి పన్నెండు స్థానాలలో విజయం సాధించడమే గొప్ప విషయంగా ఆ పార్టీ శ్రేణులే ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నాయి.
ఈ విషయం పార్టీ అధిష్టానానికి కూడా తెలుసునని అంటున్నాయి. వాస్తవానికి బీజేపీలో గ్రూపులు అసంఖ్యాకంగా ఉన్నాయనీ, అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయనీ అంటున్నారు. పార్టీ రాష్ట్ర నేతలలో ఒకరితో ఒకరికి పడదనీ, ఎవరిదారి వారిదేగా వారి తీరు ఉందనీ పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, గ్రూపులు, అంతర్గత విభేదాలు, అసమ్మతి విషయంలో రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ కు ఏ మాత్రం తీసుపోదని చెబుతున్నారు.
గ్రామీణ స్థాయిలో బీజేపీకి క్యాడరే లేదన్న విషయాన్ని కూడా వారీ సందర్భంగా చెబుతున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అంతా బాగుందన్న బిల్డప్ ఇచ్చినా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెబుతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో మాజీ మంత్రి ఈటలకు సముచిత స్థానం ఇచ్చినట్లు కనిపిస్తున్నా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఈటలకు మధ్య పెద్ద అగాధం ఉందని అంటున్నారు.
పేరుకు చేరికల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి దాని బాధ్యతలు ఈటలకు అప్పగించినా.. ఆ దిశగా ఈటల అడుగు ముందుకు వేయడానికి వీల్లేనంతగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ ఇలా ఎవరికి వారు సొంత గ్రూపును నిర్వహిస్తూ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరి బీజేపీ అడుగులు తెలంగాణలో గడపదాటే పరిస్థితిలో లేకపోయినా.. మాటలు కోటలు దాటుతున్నాయి.
వాస్తవానికి టీఆర్ఎస్ అధినేత తన వ్యూహకర్త పీకే బృందంతో చేయించిన సర్వేలలో కానీ, బీజేపీ నాయకత్వం క్షేత్రస్థాయి పరిశీలనలో కానీ తేలిందేమిటంటే… బీజేపీకి తెలంగాణలో అది చెప్పుకుంటున్నంత సీన్ లేదనీ, ఆ పార్టీ పది నుంచి పన్నెండు అసెంబ్లీ స్థానాలలో కూడా విజయం సాధించడం కష్టసాధ్యమేననీ, అదే సమయంలో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా జనం భావిస్తున్నారని. కాంగ్రెస్ బలంగా పుంజుకుంది.
కేసీఆర్ కు రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి అధికారాన్ని చేపట్టడం ఎలా అవసరమో.. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న తన లక్ష్యం చేరుకోవడానికి బీజేపీకి కాంగ్రెస్ పుంజుకోకుండా చూడటం అంతే అవసరం. ఇక్కడే ఆ రెండు పార్టీలూ కలిసి రసవత్తర రాజకీయ డ్రామాకు తెరతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రెండూ కలిసి పరస్పర విమర్శలతో కాంగ్రెస్ పుంజుకుంటున్నదన్న సమాచారం ప్రజలకు దూరం చేయడంలో భాగంగా పరస్పర విమర్శల పర్వానికి తెర లేపాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
అందుకే కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నట్లు కనిపించినా రాష్ట్ర రాజకీయాల గురించిన ప్రస్తావన మానేసి జాతీయ అజెండా పాట ఎత్తుకుని నిత్యం మోడీపైనా, మోడీ సర్కార్ పైనా విమర్శలు గుప్పిస్తుంటే.. బీజేపీ ప్రజా సమస్యల మాట వదిలేసి కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన అంటూ విమర్శల పల్లవి ఎత్తుకుందని వారు వివరిస్తున్నారు.
తమ ప్రచారార్భాటం ద్వారా తెలంగాణలో పోటీ కేవలం బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యే తప్ప కాంగ్రెస్ కు అంత సీన్ లేదన్న ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు గులాబీ పార్టీని వద్దనుకుంటే కాంగ్రెస్ కే పట్టం కడతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.