మాటకు ముందు, తర్వాత పులివెందుల, కడప, మొత్తంగా చెప్పాలంటే రాయలసీమపై విమర్శలు చేయకుండా తండ్రీకొడుకులైన చంద్రబాబు, లోకేశ్ నోరు తెరవరు. రాయలసీమ పరిధిలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గంలోని నారావారి పల్లెలో పుట్టిపెరిగిన చంద్రబాబుకు తనకు అన్ని రకాలుగా జన్మనిచ్చిన రాయలసీమపై ఎందుకంత తీవ్రస్థాయిలో కసి పెంచుకున్నారో ఎవరికీ అర్థం కాని విషయం.
రాయలసీమపై నోరు పారేసుకోవడంలో తండ్రి బాటలోనే తనయుడు లోకేశ్ నడుస్తున్నారు. మరీ ముఖ్యంగా తమ పార్టీని కూకటివేళ్లతో సహా పెకలించిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజక వర్గంపై పదేపదే నిందలు వేయడం లోకేశ్‌కు సరదా అయింది. ఆయన తీరుపై రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. చేతనైతే రాజకీయంగా జగన్‌పై ప్రతాపం చూపాలే తప్ప, ఒక ప్రాంతాన్ని తిట్టిపోయడం ఏంటని నిలదీస్తున్నారు.
లోకేశ్ తాజా ట్వీట్‌లో పులివెందులపై తన అక్కసును వెళ్లగక్కారు. పులివెందులపై లోకేశ్ మనసులో గూడుకట్టుకున్న విద్వేషం ఎలాంటిదో ఆయన ట్వీటే ప్రతిబింబిస్తోంది. ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.
‘విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుందో లేదో కానీ, వైకాపా మార్క్ పులివెందుల పోలీసింగ్‌తో అరాచకాలకు అడ్డాగా మారింది. కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్‌గా పనిచేస్తోన్న లక్ష్మీఅపర్ణ అపోలో ఆసుపత్రిలో విధులు ముగించుకొని, తన స్నేహితునితో కలిసి ఇంటికి వెళుతుండగా పోలీసులు దాడి చేయటం సిగ్గుచేటు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌పై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడటం దారుణం’ అని లోకేశ్ ట్వీట్‌లో మండిపడ్డారు. ఇంకా ఆయన ట్వీట్‌లో పాత సంగతులు కూడా ఉన్నాయి.
చివరికి పోలీసింగ్‌కు కూడా పులివెందుల ఓ ప్రత్యేకత కలిగి ఉందనే రీతిలో లోకేశ్ ట్వీట్ సాగింది. ప్రతిదానికి పులివెందుల, కడప, రాయలసీమలోని ఇతర ప్రాంతాలను ముడిపెట్టడం వల్లే గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం మూడంటే మూడే అసెంబ్లీ నియోజక వర్గాలకు ప్రజలు పరిమితం చేశారు. అయినప్పటికీ టీడీపీ వైఖరిలో మార్పు రాలేదు.
భవిష్యత్‌లో కూడా మార్పు వస్తుందనే నమ్మకం లేదు. జనం కూడా తమను అవమానపరుస్తున్న చంద్రబాబు, లోకేశ్‌లకు తగిన విధంగా బుద్ధి చెబుతూనే ఉంటారని రాయలసీమ వాసులు అభిప్రాయపడుతున్నారు.