కేజీఎఫ్.. కన్నడనాట బాహుబలి అనిపించుకున్న సినిమా ఇది. ఆ చిత్ర పరిశ్రమలో ఇది అంత పెద్ద హిట్ అయింది మరి. ఈ సినిమాలో హీరో ఎలివేషన్లు ఎక్కువ, స్టోరీ తక్కువ. అయినప్పటికీ అదొక ట్రెండ్ అయింది. కన్నడనాట మాత్రమే కాకుండా, ఇండియా వైడ్ హిట్ అయింది కేజీఎఫ్. అలాంటి సినిమాను తీసిన ప్రశాంత్ నీల్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయాడు.
కేజీఎఫ్ హిట్ అయిన వెంటనే ప్రశాంత్-ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతోందంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని కన్నడ న్యూస్ ఛానెల్స్ కూడా ప్రసారం చేయడంతో ఈ టాపిక్ మరోసారి వైరల్ అయింది. కానీ ఇది కేవలం పుకారు అని తేలింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్నాడు. మరో ఏడాది వరకు ఎవరికీ కాల్షీట్లు ఇచ్చే పొజిషన్ లో లేడు.
తాజాగా ప్రశాంత్-మహేష్ కాంబోపై కూడా కథనాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా సుకుమార్ ప్రాజెక్ట్ నుంచి మహేష్ తప్పుకున్న తర్వాత ఈ టైపు గాసిప్స్ రావడం ప్రారంభమయ్యాయి. కానీ ఇందులో కూడా నిజం లేదు. మహర్షి పనిమీదున్న మహేష్, ఆ తర్వాత అనీల్ రావిపూడి సినిమాకు షిఫ్ట్ అవుతాడు. అనీల్ రావిపూడి సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే మరో సినిమాపై నిర్ణయం తీసుకుంటాడు.
ఇలా ప్రశాంత్ నీల్ పై టాలీవుడ్ లో చాలా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈ దర్శకుడు ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్-2పై సీరియస్ గా దృష్టిపెట్టాడు. వచ్చేనెల నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమా నార్త్ లో కూడా హిట్ అవ్వడంతో.. చాప్టర్-2లో ఉత్తరాది నటీనటుల్ని కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు. అదీ సంగతి.