కోర్టుకు గైర్హాజరైన ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
బిల్లుల చెల్లింపు విచారణలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేని విషయం తెలిసిందే. బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
దీంతో కొందరు న్యాయస్థానం ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ బిల్లుల చెల్లింపు అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, విద్యాశాఖ కార్యదర్శి సురేష్కుమార్ కోర్టుకు హాజరయ్యారు. కానీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ గైర్హాజరయ్యారు.
ఈ విచారణలో ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ కీలకం. ఆయనే రాకపోవడంపై జస్టిస్ బట్టు దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యనారాయణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
కోర్టుకు ఏం సమాధానం చెప్పాలో దిక్కుతోచక సత్యనారాయణ గైర్హాజరయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.