ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ తన తడాకా చూపుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆ మహమ్మారి మాత్రం తననెవరూ ఏమీ చేయలేరంటూ సవాల్ విసురుతోంది. దీంతో మానవ మేధస్సుకు కరోనా ఓ పెద్ద సవాల్‌గా మారింది. సాధ్యమైనంత త్వరగా కరోనా అంతు చూడకపోతే మాత్రం….అది మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేసే ప్రమాదం ఉంది. కరోనా వైరస్ పని పట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో `సెవెన్త్ సెన్స్` అనే సినిమా ప్రస్తుతం బాగా చర్చనీయాంశమవుతోంది. దీనికి కారణం…ఆ సినిమా కథ ప్రస్తుతం కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయాన్ని ప్రతిబింబించడమే. కొన్నేళ్ల క్రితం తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో సూర్య కాంబినేషన్లో `సెవెన్త్ సెన్స్` తెరకెక్కింది.
ఈ సినిమాలో చైనా వల్ల వచ్చిన వైరస్ కారణంగా భారతదేశం తీవ్ర ముప్పును ఎదుర్కొంటుంది. ఆ వైరస్ నాశనం కావాలంటే వందేళ్ల కిందటి బోధి ధర్మని తీసుకురావడం ఒకటే మార్గమని జన్యు పరిశోధకురాలైన శ్రుతి తెలుసుకుంటుంది.
దీంతో అతని వంశానికి చెందిన హీరోలో జన్యు పరిణామ క్రమం జరిపి వందేళ్ల కిందటి బోధిధర్మని మళ్లీ తీసుకొస్తుంది. అతను ఇచ్చిన మందు వల్ల వైరస్ నాశనమైపోతుంది.
సరిగ్గా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు కొన్నేళ్ల క్రితం కథాంశంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. కరోనా వైరస్ కూడా చైనా దుష్టపన్నాగమనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం పెను ప్రమాదంలో పడింది. దీంతో బోధిధర్మని మళ్లీ తీసుకురమ్మంటూ ఆ సినిమాలో పరిశోధకురాలి పాత్రలో నటించిన శ్రుతికి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున మెసేజ్‌లు వెళుతున్నాయట.
ఈ విషయాన్ని శ్రుతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొత్తానికి నెటిజన్లంతా కరోనా వైరస్‌ను తరిమికొట్టే శక్తి ఒక్క శ్రుతికి మాత్రమే ఉందని నమ్ముతున్నారట. అందుకే ఆమెకు అన్ని విజ్ఞప్తులు.