కరోనా నివారణకు తీవ్రమైన చర్యలను తీసుకున్నా.. యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కనీసం రెండు లక్షల మంది ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం ఉంటుందని ఒక అమెరికన్ అధ్యయన సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకూ అమెరికాలో కరోనా వల్ల 2,500 మంది వరకూ మరణించారు. ఇలాంటి నేపథ్యంలో కరోనా వల్ల ఏకంగా రెండు లక్షల మంది ప్రాణాలకు ప్రమాదం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్టియెస్ డిసీజెస్ సంస్థ ప్రకటించడం సంచలన రీతిలో ఉంది. సోషల్ డిస్టెన్స్ ను పాటించినా కూడా అమెరికాలో ఈ మేరకు కరోనా మనుషులకు ప్రమాదకరంగా మారుతుందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంటోనీ ఎస్ ఫౌసీ ప్రకటించారు.
ఇప్పటికే అమెరికాలో కరోనా ఇన్ఫెక్ట్ అయిన వారి సంఖ్య దాదాపు లక్షా నలభై వేలకు చేరింది. వారిలో రెండు వేల ఐదు వందల మంది వరకూ మరణించినట్టుగా అమెరికన్ మీడియా చెబుతూ ఉంది. మరోవైపు కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ పోతోంది. రోజుకు కొన్ని వేల మంది ఈ జబ్బు బారిన పడుతూ ఉన్నారు. అమెరికా ఆదిలోనే కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోకపోవడం, ప్రజలు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడంతో కరోనా ప్రభావం క్రమక్రమంగా పెరిగింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక స్థాయి కరోనా పేషెంట్ల దేశంగా నిలుస్తూ ఉంది అమెరికా.
ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించాలని అమెరికన్ ప్రభుత్వం పదేపదే కోరుతూ ఉంది. అయితే ఇప్పటికే అక్కడ కరోనా అంటుకోవడం తీవ్ర స్థాయికి చేరింది.ఈ నేపథ్యంలో మరింత కఠిన చర్యలు తీసుకున్నా వాటి ప్రభావం తక్కువే అని, కరోనా ఏకంగా రెండు లక్షల మంది ప్రాణాలను తీసే అవకాశం ఉందని ఆ దేశ అధికారిక సంస్థలే ఆందోళనకరమైన గణాంకాలను వెల్లడిస్తూ ఉన్నాయి. మరి ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకుని అమెరిక్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో! కరోనా నివారణకు టీకా కనుగోవడం మీదే అమెరికన్ వైద్య పరిశోధన సంస్థలు, అమెరికన్ ప్రభుత్వం తీవ్రంగా దృష్టి పెట్టాయి.