అడ్డంగా దొరికిపోతున్నావ్.. నీకు అర్థమౌతోందా బాబు!

రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడుంది? ఎక్కడైనా పునాది వేశారా? శంకుస్థాపన చేశారా? పిడికెడు మట్టి వేశారా? ఏడాదిగా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఇవి. వీటికి కొనసాగింపుగా అప్పులు తెచ్చి ఇష్టమొచ్చినట్టు పంచేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాబు. కానీ…

రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడుంది? ఎక్కడైనా పునాది వేశారా? శంకుస్థాపన చేశారా? పిడికెడు మట్టి వేశారా? ఏడాదిగా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఇవి. వీటికి కొనసాగింపుగా అప్పులు తెచ్చి ఇష్టమొచ్చినట్టు పంచేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాబు. కానీ తన విమర్శలతో తనకు తెలియకుండానే బాబు దొరికిపోతున్నారు?

2024లో ఏం హామీలిస్తారు?

జగన్ ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు తడిసిముద్దవుతున్నారు. అందరూ తృప్తిగా ఉన్నారు. బాబు 2024 ఎన్నికల నాటికి వీటికి మించిన హామీలు ఇవ్వాల్సిందే. బాబు అదే పని చేస్తారు కూడా. కానీ అప్పుడు దొరికిపోతారు. 

ఇప్పుడు జగన్ డబ్బులు పంచుతున్నారని అన్న బాబు.. అప్పుడు ఏ ముఖం పెట్టుకొని హామీలిస్తారు. అయినా బాబు హామీల్ని జనం నమ్ముతారా? 2014లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో కనిపించకుండా మాయం చేసిన ఘటనల్ని ప్రజలు మరిచిపోలేరు.

అభివృద్ధి అంటే కట్టడాలేనా?

ఇక జగన్ హయాంలో అభివృద్ధి అస్సలు జరగడం లేదంటున్నారు చంద్రబాబు. కొత్తగా ఓ ఫ్యాక్టరీ రాలేదని, ఓ నిర్మాణం జరగలేదని అంటున్నారు. అసలు అభివృద్ధి అంటే కట్టడాలేనా? కొత్తగా బిల్డింగులు కట్టి, రోడ్లు వేస్తే అభివృద్ధి జరిగిపోతుందా? అసలైన అభివృద్ధి అంటే సగటు మనిషి జీవన ప్రమాణం పెరగాలి. అతడి సామాజిక స్థితి మెరుగుపడాలి. 

సంక్షేమ పథకాలతో జగన్ చేస్తోంది అదే. వివిధ పథకాల పేరిట సామాన్యుడి చేతికి డబ్బు అందిస్తున్నాడు. వాళ్ల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు ఇస్తున్నాడు. ఉండడానికి ఓ ఇల్లు కట్టి ఇస్తున్నాడు. వాడు బతకడానికి ఓ మార్గం చూపిస్తున్నాడు. అభివృద్ధి అంటే ఇది కాదా?

బాబు అభివృద్ధి ''మాయ''

ఇన్నాళ్లూ ప్రజల్ని మాయలో పడేశారు చంద్రబాబు. అభివృద్ధి అంటే విశాఖలో పెట్టుబడుల సమావేశం పెట్డడం అనుకునేలా చేశారు. లక్షల కోట్ల రూపాయలతో అమరావతిని నిర్మిస్తేనే అభివృద్ధి అనే భావనలోకి ప్రజల్ని నెట్టేశారు. పారిశ్రామికవేత్తలతో చేసుకున్న ఎంవోయూ కాగితాల దొంతరలే అభివృద్ధి అనుకునేలా చేశారు. ప్రజలు అలా అనుకునేలా బాబు, అతడి మీడియా ఓ మాయా ప్రపంచం సృష్టించింది. దీన్ని జగన్ బద్దలుకొట్టారు.

అభివృద్ధి అంటే కళ్ల ముందు పెద్ద మేడ కనిపించడం కాదు. మన ముందు ఫ్యాక్టరీనో లేక 6 వరసల రోడ్డు కనిపించడం కాదు. అభివృద్ధి అంటే మనం ఉండడానికి ఓ ఇల్లు సంపాదించుకోవడం, అభివృద్ధి అంటే నెలాఖరుకు కూడా చేతిలో డబ్బు ఉండడం, అభివృద్ధి అంటే పిల్లలకు మంచి చదువు దొరకడం. అభివృద్ధి అంటే పండించిన పంటకు న్యాయం జరగడం. జగన్ వచ్చిన తర్వాత సామాన్యులకు ఇవన్నీ జరుగుతున్నాయి. అసలైన అభివృద్ధి అంటే ఏంటో జనం తెలుసుకున్నారు. ఈ రెండేళ్లలో బాబు మాయల నుంచి పూర్తిగా బయటపడ్డారు.

అంతేకాదు, ఎప్పుడైతే ప్రజల చేతిలో డబ్బు ఉంటుందో, ఆటోమేటిగ్గా మార్కెట్లతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందనేది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. కాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ చంద్రబాబు పదే పదే చేస్తున్న ప్రచారం.. రాబోయే ఎన్నికల్లో ఆయనకే రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయం ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా బాబుకు కూడా అర్థమౌతోంది. కానీ ఏమీ చేయలేని దుస్థితి.