సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో అస్సలు చెప్పలేం. సుకుమార్ తో సినిమా చేయడంలేదని మహేష్ ప్రకటించిన వెంటనే, సుకుమార్ పై ట్రోలింగ్ మొదలవుతుందని చాలామంది ఊహించారు. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన వన్-నేనొక్కడినే సినిమాపై సెటైర్లు స్టార్ట్ అవుతాయని మరికొందరు భావించారు. కానీ ఆశ్చర్యకరంగా పూరి జగన్నాధ్ తెరపైకి వచ్చాడు.
సుకుమార్ తో సినిమా పోతేపోయింది, పూరి జగన్నాధ్ తో మాత్రం మూవీ మిస్ చేసుకోవద్దంటున్నారు మహేష్ బాబు అభిమానులు. ఈ మేరకు మహేష్ ట్వీట్ కు ప్రతిగా రీట్వీట్లతో పూరి జగన్నాధ్ ను ట్యాగ్ చేస్తూ పోస్టులు షురూ చేశారు. “మహేష్.. నువ్వు మాస్ సినిమా చేసి ఎన్నాళ్లయిందో గుర్తుందా” అంటూ విమర్శిస్తూనే, అర్జెంట్ గా పూరి తో సినిమా ప్లాన్ చేయమంటూ పోస్టులు పెడుతున్నారు.
మహేష్-సుకుమార్ సినిమా ఆగిపోయిన వెంటనే ఇలా పూరి జగన్నాధ్ తెరపైకి రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే, మహేష్ కు వెంటనే ఇప్పుడు అనీల్ రావిపూడితో సినిమా సిద్ధంగా ఉంది. మహర్షి కంప్లీట్ అయిన వెంటనే అనీల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు ఈ హీరో. కానీ ఫ్యాన్స్ మాత్రం పూరితో పోకిరి టైపులో ఓ మాస్ సినిమా చేయాలని మహేష్ ను వేడుకుంటున్నారు.
గతంలో మహేష్ హీరోగా జనగణమన అనే టైటిల్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు పూరి జగన్నాధ్. ఇద్దరి మధ్య కథాచర్చలు కూడా జరిగాయి. కానీ ఆ సినిమా కూడా సెట్స్ పైకి రాకుండానే ఆగిపోయింది. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్లీ పూరి జగన్నాధ్ డైరక్షన్ లో మహేష్ సినిమా చేయలేదు.
అభిమానుల మనసుల్లో అయితే మరో పోకిరి రావాలనే కోరిక ఉంది. కానీ పూరికి ఇప్పుడు అంత స్టామినా లేదనే విషయం అందరికీ అర్థమౌతూనే ఉంది. ఇప్పటికిప్పుడు మహేష్ తో మూవీ చేయాలనుకుంటే, పూరి జగన్నాధ్ అర్జెంట్ గా ఓ హిట్ కొట్టాలి. అప్పటివరకు ఈ కాంబినేషన్ కలవదు.