దూకుడు సినమాలో పోలీస్ గా తన ట్రాక్ రికార్డ్ గురించి గొప్పగా చెబుతాడు మహేష్ బాబు. రీల్ లైఫ్ లో కూడా మహేష్ బాబుకి ఓ ట్రాక్ రికార్డ్ ఉంది. తనకు ఫస్ట్ టైమ్ హిట్ ఇచ్చిన దర్శకులతో మాత్రమే రెండోసారి పనిచేస్తాడు ఈ హీరో. తనతో చేసిన ఫస్ట్ సినిమానే ఫ్లాప్ గా ముగిస్తే ఆ దర్శకుడి జోలికి రెండోసారి వెళ్లడు.
ఒక్కడుతో సక్సెస్ ఇచ్చాడు కాబట్టే నమ్మి గుణశేఖర్ కి మరో రెండు అవకాశాలిచ్చాడు. పూరీ జగన్నాథ్ పోకిరి తీశాడనే హిట్ సెంటిమెంట్ తోనే బిజినెస్ మేన్ చేశాడు. అతడు మూవీ తర్వాత త్రివిక్రమ్ తో ఖలేజా, దూకుడు తర్వాత శ్రీనువైట్లతో ఆగడు చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడింది కాబట్టే శ్రీకాంత్ అడ్డాలకు మరో ఆఫర్ ఇచ్చాడు.
తాజాగా శ్రీమంతుడు, భరత్ అనే నేను.. సినిమాలు కూడా ఇదే సెంటిమెంట్ తో కొరటాల శివ దక్కించుకున్నాడు. ఇలా సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ కే రెండోసారి అవకాశమివ్వడం మహేష్ బాబుకి అలవాటు, ఆనవాయితీ. ఫ్లాప్ తీస్తే మాత్రం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దర్శకుడుని నమ్మడు. అతడి ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా కూడా తనతో సెట్ కాడని తీసి పక్కనపెట్టేస్తాడు.
సరిగ్గా సుకుమార్ విషయంలో కూడా ఇదే జరిగింది. 1-నేనొక్కడినే సినిమాతో మహేష్ ని బాగా డిజప్పాయింట్ చేశాడు సుకుమార్. పైకి కల్ట్ క్లాసిక్ అని చెబుతున్నప్పటికీ, ఆ దెబ్బతో ప్రయోగాల జోలికి ఇంకోసారి వెళ్లకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే ఎక్కడో ఇద్దరికీ రెండోసారి లైన్ కుదిరింది.
మహేష్ కి లోపల సెంటిమెంట్ పీకుతున్నా కథ వినడానికి రెడీ అన్నాడు. రెండు మూడు సిట్టింగ్ లు అయినా, ఏదీ ఫైనల్ కాలేదు. రంగస్థలం ఫీల్ నుంచి బైటపడని సుకుమార్ అదే లైన్ చుట్టూ తిరుగుతూ మహేష్ ని ఇంప్రెస్ చేయలేకపోయాడు. దీంతో మహేష్ మొహమాటం లేకుండా వద్దని చెప్పేశాడు.
దీనికి క్రియేటివ్ డిఫరెన్స్ అనే పేరుపెట్టేసి సినిమా క్యాన్సిల్ అయిందని ట్వీటేశాడు. మహేష్ తన సెంటిమెంట్ ని ఫాలో అయ్యాడా..? లేక సుకుమార్ ఆయన్ను మెప్పించలేకపోయాడా..? మేటర్ బయటకు రాలేదు కానీ టాలీవుడ్ లో ఈ క్రియేటివ్ డిఫరెన్స్ పై ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.