కరోనాపై గ్రామస్థాయి వరకు ప్రజలు మెల్లమెల్లగా చైతన్యవంతం అవుతున్నారు. దీనికి ఉదాహరణగా నిలిచింది కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఈ ఘటన. ఊరి నుంచి వచ్చిన తన భర్తకు, ప్రాధమిక వైద్యపరీక్షలు చేయించుకుంటే తప్ప కాపురం చేయనని కండిషన్ పెట్టింది భార్య.
ఆదోని మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తాడు. నెలలో సగం రోజులు బయటే తిరుగుతుంటాడు. లాక్ డౌన్ కారణంగా 2 రోజుల కిందట మిర్యాలగూడ నుంచి ఇంటికి చేరుకున్నాడు. దీంతో అతడ్ని కరోనా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరింది భార్య. దానికి సదరు వ్యక్తి నిరాకరించాడు.
కనీసం ప్రాధమిక పరీక్షలు కూడా చేయించుకోకుండా కాపురం ఎలా చేస్తానని భార్య ప్రశ్నించింది. తనకు, పిల్లలకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని భావించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి ఆదోని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సదరు లారీడ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆదోనిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడికి ప్రాధమిక వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్ లింగన్న.. 2 వారాల పాటు స్వీయ నిర్భంధంలో ఉండాలని సూచించారు. దీంతో అతడ్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
మహిళ తీసుకున్న చొరవకు, ఆమెకున్న అవగాహనకు స్థానిక అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశమంతా ఈ మహిళను ఆదర్శంగా తీసుకోవాలని మెచ్చుకున్నారు.