సరిగ్గా వారం రోజుల క్రితం జనతా కర్ఫ్యూ జరుగుతున్న వేళ.. సాయంత్రం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపేందుకు తెరపైకి వచ్చిన ప్రధాని మోదీ.. మార్చి నెలాఖరు వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని ఏప్రిల్ 14 వరకు పొడిగించేశారు. దీంతో ఎక్కడి వారక్కడే నిలిచిపోయారు. మోదీ లాక్ డౌన్ అన్న వెంటనే రైళ్లు ఆగిపోయాయి, బస్సులు ఆగిపోయాయి, వ్యక్తిగత వాహనాలు తీయడానికి జనం భయపడిపోయారు.
ఉపాధి కోసం పక్క ఊర్లు, జిల్లాలు, రాష్ట్రాలు దాటిపోయిన వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సొంత ప్రాంతానికి వెళ్లడానికి రవాణా లేదు, ఉన్నచోట ఉండటానికి కూడు, నీడ లేదు. మరి వీళ్లు ఏంచేయాలి? వారం రోజులుగా దీనికి పరిష్కారమే లేదు. చివరికి ఇప్పటికీ ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో వేలాదిమంది ఒకేచోట గుమికూడి స్వస్థలాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గత వారం జనతా కర్ఫ్యూ తర్వాత రెండు రోజులు పాటు రైళ్లు, బస్సులు.. అన్నిట్లో ప్రయాణం ఉచితం అని ప్రకటించేసి ఎక్కడివారక్కడ చేరుకున్నాక లాక్ డౌన్ ప్రకటించి ఉంటే బాగుండేదోమోనని కొంతమంది వాదన. అలా చేస్తే.. అప్పటికే కరోనా విజృంభించేసి ఉండేదని ఇంకో వాదన. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. విదేశాల నుంచి వచ్చినవారు ఇప్పటికే చాలామందికి ఈ రోగాన్ని అంటించేశారు. ముఖ్యంగా ఉన్నత కుటుంబాల వారే ఎక్కువగా హోమ్ క్వారంటైన్ ని నిర్లక్ష్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారే విషయం స్పష్టమవుతోంది.
ఇతర దేశాలతో పాటు భారత్ లో కూడా కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయే తప్ప తగ్గలేదు. మరోవైపు ప్రజలు సొంతూళ్లకు వెళ్లడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు, పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తింటూనే ఉన్నారు, కాలినడకన బతుకు జీవుడా అంటూ వందల కిలోమీటర్లు పిల్లాపాపలతో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. వీరి కష్టాలకు ఎవరు కారణం, వీరికీ కరోనాకీ ఏంటి సంబంధం. ఇలా ప్రయాణం చేస్తూ చేస్తూనే ప్రమాదాల్లో పదుల సంఖ్యలో అభాగ్యులు దుర్మరణం పాలయ్యారు.
లాక్ డౌన్ లేకపోయి ఉంటే వీరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవా? కనీసం వీరికి ఈ కష్టాలైనా తప్పేవి కాదా? హడావిడిగా లాక్ డౌన్ ప్రకటించేయడంతోనే పరిస్థితి దారుణంగా తయారైందని, అటు కరోనా కట్టడి కాకపోవడంతో పాటు, ఇటు ప్రజల్ని అష్ట కష్టాలు పెడుతున్నారంటూ ఓ వర్గం మండిపడుతోంది. ఇంతకీ మోదీ చేసింది తెలివైన పనేనా? లేక తొందరపాటు నిర్ణయం తీసుకుని నిరుపేదల్ని రోడ్డునపడేశారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.