కరోనా ప్రభావం ఏమిటో ఇప్పుడిప్పుడే సామాన్యులకు కూడా అర్థం అవుతున్నట్టుగా ఉంది. ప్రత్యేకించి పల్లెలు, చిన్న చిన్న పట్టణాల్లో చాలా మంది గృహిణులకు ఇప్పుడు అసలు కథ అర్థం అవుతూ ఉంది. కరోనా వల్ల అంతా ఇళ్లల్లోనే బంధీలు అయ్యారు. ఇది గృహిణులకు పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే.. వాళ్లు ఎప్పుడూ ఇళ్లకే బంధీలు కాబట్టి. వారానికి ఒకసారి బయటకు వెళ్లడమే ఎక్కువ! అయితే ఇప్పుడు భర్త, పిల్లలు కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. ఇది సగటు మహిళలు కోరుకునేదే! వాళ్లు ఇళ్లల్లో ఉండటం వల్ల తమ ఇంటి వరకూ కరోనా రాదు కాబట్టి ఆ రకంగా కూడా మహిళలు హ్యాపీనే!
అయితే ఇప్పుడు అంతకు మించిన సమస్య వారి దరి చేరింది. అదేమిటంటే.. సీరియల్స్ ఆగిపోవడం! కరోనా లాక్ డౌన్ రెండో వారానికి చేరే సమయానికే టీవీల్లో సీరియల్స్ ఆగిపోయాయి. ఒకటని కాదు.. రన్నింగ్ లో ఉన్న సీరియల్స్ అన్నీ దాదాపుగా ఆగిపోయాయి. గత ఆదివారం మొదటి సారి జనతా కర్ఫ్యూను అనౌన్స్ చేసింది కేంద్రం. ఆ తర్వాత లాక్ డౌన్ కొనసాగుతూ వస్తోంది. వారం రోజుల పాటు సర్వం బంద్ అయ్యాయి. సినిమాల షూటింగులు నిలిచిపోయినట్టుగానే.. సీరియళ్ల షూటింగులు కూడా నిలిచిపోయాయి!
సీరియళ్లు ఏమీ ఔట్ డోర్ లో షూటింగ్ చేసుకోవు. అవన్నీ ఇళ్లలోనే జరుగుతాయి. అయినప్పటికీ.. షూటింగు స్పాట్ లకు సీరియల్ నటీనటులు చేరుకోలేని పరిస్థితి. ఇతర సిబ్బంది అవసరం ఉండనే ఉంటుంది. ఎవరూ ఇళ్లుదాటి బయటకు రాలేరు. దీంతో షూటింగులు జరగలేదు. సీరియళ్ల షూటింగులు వేడివేడిగా చేసి, వడ్డించినట్టుగా ఉంటాయి. ఈ వారంలో ప్రసారం అయ్యే ఎపిసోడ్స్ కేవలం రెండు మూడు రోజుల ముందే షూటింగ్ జరుపుకుంటాయి. దీంతో..వారం రోజుల లాక్ డౌన్ తో కొత్తగా ప్రసారం చేయడానికి, కొనసాగించడానికి ఎపిసోడ్స్ లేకుండా పోయాయి. దీంతో.. మరో మాట లేకుండా సీరియల్స్ ఆగిపోయాయి.
సీరియల్స్ టాప్ రేటింగులతో చానళ్లకు బోలెడంత ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. అలాంటి లీడింగ్ సీరియళ్లను కూడా ఎక్కడిక్కడ ఆపేయడం తప్ప చానళ్లు కూడా మరేం చేయలేని పరిస్థితి. సీరియళ్ల ప్రైమ్ టైమ్ లో ఇప్పుడు సినిమాలు ప్రసారం చేస్తున్నాయి కొన్ని చానళ్లు. మరి కొన్ని చానళ్లు మాత్రం.. పాత సీరియళ్లను పునఃప్రసారం చేయడం, లేదా తాము ఇది వరకూ టెలికాస్ట్ చేసిన వినోద కార్యక్రమాలనే మళ్లీ వేయడమో చేస్తున్నాయి. మహిళలు ఎంతో ఇష్టంగా ఫాలో అయ్యే సీరియళ్ల ప్రసారం ఇప్పుడు పూర్తిగా ఆగిపోవడంతో వాళ్లకు కూడా కరోనా తీవ్రత అర్థం అవుతూ ఉంది.